గణేష్ మండపాల నిర్వాహకులకు ఎస్సై శ్రీకాంత్ రెడ్డి సూచనలు
వలిగొండ, సెప్టెంబర్ 08 (దేశ టైమ్స్): వినాయక చవితి ఉత్సవాలను ప్రజలందరూ ప్రశాంత వాతావరణంలో భక్తిశ్రద్ధలతో నిర్వహించాలని స్థానిక ఎస్సై శ్రీకాంత్ రెడ్డి సూచించారు. గణేష్ మండపాల ఏర్పాటుకు ముందు పోలీస్‌శాఖతో పాటు విద్యుత్‌శాఖ, మున్సిపల్/గ్రామ పంచాయతీ అధికారుల నుంచి తప్పనిసరిగా ముందస్తు అనుమతులు తీసుకోవాలని స్పష్టం చేశారు.
మండపాల ఏర్పాటు వల్ల ట్రాఫిక్‌కు, ప్రజల రాకపోకలకు ఎలాంటి అంతరాయం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. రాత్రి వేళల్లో నిర్ణీత సమయం దాటిన తర్వాత మైకులు, అధిక శబ్దం చేసే పరికరాలను వినియోగించరాదని, డీజేల విషయంలో నిబంధనలు కచ్చితంగా పాటించాలని తెలిపారు. ప్రతి మండపం వద్ద భద్రత కోసం సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని, రాత్రి వేళల్లో కనీసం ఇద్దరు లేదా ముగ్గురు నిర్వాహకులు మండపం వద్ద అందుబాటులో ఉండాలని సూచించారు. శోభాయాత్ర సందర్భంగా శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా వ్యవహరించినా, నిబంధనలు ఉల్లంఘించినా చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై శ్రీకాంత్ రెడ్డి హెచ్చరించారు. ప్రజల భద్రత, శాంతిభద్రతలకు ప్రాధాన్యతనిస్తూ గణేష్ ఉత్సవాలను క్రమశిక్షణతో, ప్రశాంతంగా నిర్వహించాలని ఆయన సూచించారు.

