*విద్యార్థుల గొంతు పట్టుకున్న సీఐ రఘుపతి రెడ్డి గారు… DCO ఛాంబర్లో ధర్నా చేసిన కాంగ్రెస్ నాయకులు గొంతును ఎందుకు పట్టుకోలేదు.?*
*రౌడీ షీటర్ల పట్ల ఎందుకంత ప్రేమ?*
*మహబూబాబాద్‌లో పోలీసుల తీరుపై విద్యార్థులు, తల్లిదండ్రుల, జిల్లా ప్రజలు తీవ్ర ఆగ్రహం.*
మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో తమ సమస్యల పరిష్కారం కోసం పాలిటెక్నిక్ విద్యార్థులు చేపట్టిన కలెక్టరేట్ ముట్టడి ఉద్రిక్తంగా మారింది. ఈ సందర్భంగా విద్యార్థులను పోలీసులు అడ్డుకునే క్రమంలో మహబూబాబాద్ సీఐ రఘుపతి రెడ్డి ఇద్దరు విద్యార్థుల గొంతులు పట్టుకుని వెనక్కి నెట్టిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
తమ న్యాయబద్ధమైన సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు కలెక్టరేట్ వద్ద నిరసన వ్యక్తం చేస్తున్న విద్యార్థులపై పోలీసులు వ్యవహరించిన తీరుపై తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు, జిల్లా ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
*మరి మొన్న DCO ఛాంబర్లో జరిగిన ధర్నాలో ఎందుకు స్పందించలేదు.*
ఇదే మహబూబాబాద్‌లో మొన్న జిల్లా సహకార అధికారి (DCO) కార్యాలయ ఛాంబర్లో కాంగ్రెస్‌కు చెందిన కొందరు నాయకులు, రౌడీ షీటర్లు వెళ్లి ధర్నా చేసిన ఘటనపై ఇప్పుడు ప్రజల్లో తీవ్ర చర్చ జరుగుతోంది.
అధికారి కార్యాలయ ఛాంబర్లోకి వెళ్లి ధర్నా చేయడం, కార్యాలయ కార్యకలాపాలకు అంతరాయం కలిగించడం వంటి పరిస్థితులు ఏర్పడినప్పుడు పోలీసులు అక్కడే ఉన్నప్పటికీ ఎందుకు ఇదే స్థాయిలో కఠినంగా వ్యవహరించలేదు.
కలెక్టరేట్ గేటు బయట నిరసన తెలిపిన విద్యార్థుల గొంతు పట్టుకోవడం పోలీసుల పని తీరైతే… మొన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు( రౌడీ షీటర్లు) DCO ఛాంబర్లోకి వెళ్లి ధర్నా చేసిన వారిపై అదే పని తీరు ఎందుకు కనిపించలేదని ప్రశ్నిస్తున్నారు.
విద్యార్థులు రోడ్డుపై తమ సమస్యలను చెప్పుకుంటే వెంటనే అడ్డుకోవడం, కానీ ఒక అధికారి ఛాంబర్లోకి వెళ్లి ధర్నా చేసినప్పుడు మాత్రం పోలీసులు ప్రేక్షకులుగా ఉండటం ఏ విధమైన న్యాయమని విద్యార్థుల తల్లిదండ్రులు నిలదీస్తున్నారు.
*విద్యార్థులకు ఒక న్యాయం, కాంగ్రెస్ పార్టీ నాయకులకు (రౌడీ షీటర్లకు) మరొక న్యాయం.. చట్టం.. రెండు రకాలలా?*
ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంటుంది. అయితే ఆ నిరసన ఎవరు చేసినా పోలీసులు ఒకే విధమైన ప్రమాణాలతో వ్యవహరించాల్సి ఉంటుంది.
అధికార పార్టీకి చెందిన నాయకులు అయితే ఒక విధానం.. విద్యార్థులు అయితే మరో విధానం ఎందుకు? అనే ప్రశ్న ఇప్పుడు జిల్లా ప్రజల్లో బలంగా వినిపిస్తోంది.
DCO ఛాంబర్లో జరిగిన ధర్నాపై పోలీసులు ఏ చర్యలు తీసుకున్నారు? ఎవరిపైనైనా కేసులు నమోదు చేశారా? కార్యాలయంలోకి వెళ్లి ధర్నా చేసిన వారిని ఎందుకు అదుపులోకి తీసుకోలేదు? అనే ప్రశ్నలకు పోలీసు అధికారులు స్పష్టత ఇవ్వాలని ప్రజలు కోరుతున్నారు.
*విద్యార్థులపై మాత్రం ఇంత కఠినత్వం ఎందుకు?*
తమ భవిష్యత్తు, చదువుకు సంబంధించిన సమస్యలపై నిరసన వ్యక్తం చేస్తున్న విద్యార్థుల పట్ల పోలీసులు సంయమనంతో వ్యవహరించాల్సిన సమయంలో గొంతులు పట్టుకుని వెనక్కి నెట్టడం ఎంతవరకు సమంజసమని తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు.
“మొన్న DCO ఛాంబర్లో ధర్నా చేసినప్పుడు సీఐ గారు చేతులు ఎందుకు కదల్లేదు? నేడు విద్యార్థుల గొంతులు పట్టుకునేంత కఠినత్వం ఎక్కడి నుంచి వచ్చింది?” అంటూ వారు ప్రశ్నిస్తున్నారు.
చట్టం అందరికీ సమానంగా వర్తించాలి. అధికార పార్టీ నాయకులైనా, విద్యార్థులైనా, సామాన్య ప్రజలైనా ఒకే విధమైన చట్టపరమైన ప్రమాణాలు ఉండాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు.
విద్యార్థుల పట్ల జరిగిన ఘటనపై ఉన్నతాధికారులు స్పందించి విచారణ జరిపించాలని, అలాగే DCO ఛాంబర్లో జరిగిన ధర్నాపై కూడా పోలీసులు తీసుకున్న చర్యలను ప్రజలకు వెల్లడించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
విద్యార్థులు అంటే అంత చులకనా? లేక అధికార పార్టీ అంటే అంత భయమా? అంటూ జిల్లా ప్రజలు పోలీసుల తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
విద్యార్థులపై జరిగిన చర్యలపై జిల్లా పోలీసు ఉన్నతాధికారులు వెంటనే స్పందించి వాస్తవాలను ప్రజలకు వెల్లడించాలని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని, రక్షణ కల్పించాల్సిన పోలీస్ అధికారులు విద్యార్థుల గొంతు పట్టడం సరైంది కాదని .. వారి సమస్యలకు సమాధానం చెప్పాలి. అధికార పార్టీకి ఒక న్యాయం.. విద్యార్థులకు మరో న్యాయం ఉండకూడదని వారు డిమాండ్ చేస్తున్నారు.

