26.5 C
Hyderabad
Monday, September 14, 2026

మహిళను హత్య చేసి మృతదేహాన్ని ముక్కలుగా నరికి అడవిలో పడేసిన నిందితుడు అరెస్ట్..!

Must read

📰 Generate e-Paper Clip

హనుమకొండ: హసన్‌పర్తి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో నమోదైన మహిళ అదృశ్యం కేసు దారుణ హత్యగా తేలింది. మహిళను హత్య చేసి మృతదేహాన్ని ముక్కలుగా నరికి అటవీ ప్రాంతంలో పడేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ కేసులో నిందితుడిని శుక్రవారం అంబాల–కమలాపూర్‌ రోడ్డులో వాహన తనిఖీల సందర్భంగా పోలీసులు అదుపులోకి తీసుకుని అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు.

పోలీసుల వివరాల ప్రకారం.. హసన్‌పర్తి పరిధికి చెందిన తౌటం స్వప్న (40) మే 15న అదృశ్యమైంది. ఆమె తండ్రి అమంచ రాజేందర్‌ ఫిర్యాదు మేరకు మే 31న హసన్‌పర్తి పోలీస్‌స్టేషన్‌లో మిస్సింగ్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సాంకేతిక ఆధారాలతో విచారణ కొనసాగించగా, స్వప్న అదృశ్యం వెనుక హత్య జరిగినట్లు పోలీసులు గుర్తించారు.

ఈ కేసులో బళ్లారి జిల్లా గుడుదూరుకు చెందిన కార్‌ డ్రైవర్‌, రైతు **వొద్దిరాజుల బసవరాజ్‌ (27)**ను నిందితుడిగా గుర్తించారు. స్వప్నకు, బసవరాజ్‌కు పరిచయం ఉండేదని పోలీసులు తెలిపారు. తనను పెళ్లి చేసుకోవాలని స్వప్న అతడిపై ఒత్తిడి తెచ్చినట్లు విచారణలో వెల్లడైందన్నారు. పెళ్లి చేసుకోకపోతే తమకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను బయటపెడతానని ఆమె హెచ్చరించడంతో బసవరాజ్‌ భయాందోళనకు గురైనట్లు పేర్కొన్నారు.

ఈ క్రమంలో పెళ్లి చేసుకుంటానని నమ్మించి స్వప్నను బళ్లారికి రప్పించిన బసవరాజ్‌, గావి సిద్ధేశ్వర ఆలయం సమీపంలోని అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం మృతదేహాన్ని ముక్కలుగా నరికి అటవీ ప్రాంతంలో పడేసినట్లు విచారణలో వెల్లడైందని చెప్పారు. ఘటనకు సంబంధించిన ఆధారాలను తొలగించే ప్రయత్నంలో రక్తపు మరకలు ఉన్న దుస్తులను తగులబెట్టడంతో పాటు స్వప్న మొబైల్‌ ఫోన్‌ను చెరువులో పడేసినట్లు నిందితుడు అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు.

శుక్రవారం అంబాల–కమలాపూర్‌ రోడ్డులో హసన్‌పర్తి ఇన్‌స్పెక్టర్‌ ఎ. మహేందర్‌ సిబ్బందితో కలిసి వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా బసవరాజ్‌ పోలీసులను చూసి పారిపోయేందుకు ప్రయత్నించాడు. దీంతో పోలీసులు అతడిని వెంబడించి అదుపులోకి తీసుకున్నారు. విచారణలో స్వప్న హత్యకు సంబంధించిన వివరాలను వెల్లడించినట్లు తెలిపారు. నిందితుడి వద్ద నుంచి రియల్‌మీ మొబైల్‌ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు.

నిందితుడిపై బీఎన్‌ఎస్‌ సెక్షన్లు 103, 238 కింద కేసు నమోదు చేసి అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు.

కేసును చాకచక్యంగా ఛేదించిన హసన్‌పర్తి ఇన్‌స్పెక్టర్‌ ఎ. మహేందర్‌, ఎస్‌ఐలు సుజిత్‌, రవి, దేవేందర్‌, ఏఏఓ సల్మాన్‌ పాషా, పోలీస్‌ సిబ్బందిని ఉన్నతాధికారులు అభినందించారు.

More articles

Latest article

App Icon

Install DT News App

Add to home screen for faster loading and latest updates.