*కందికొండ పాఠశాల విద్యార్థులకు యూనిఫాంల పంపిణీ*
*పరిసరాల పరిశుభ్రతపై అవగాహన*
*విద్యార్థులకు రూ.500 ప్రోత్సాహకం*
దేశ టైమ్స్
మహబూబాబాద్
సెప్టెంబర్ 8:
మహబూబాబాద్ జిల్లా కురవి మండలం లోని
కందికొండ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు ప్రభుత్వం అందిస్తున్న పాఠశాల యూనిఫాంలను గ్రామ సర్పంచ్ తుడుసు నాగార్జున, పంచాయతీ కార్యదర్శి నరేష్, వార్డు సభ్యులు అంబడిపూడి ఇసాకర్, తోట మహేష్ ఆధ్వర్యంలో మంగళవారం పంపిణీ చేశారు. విద్యార్థులకు యూనిఫాంలు అందజేసి, వాటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ఈ సందర్భంగా సర్పంచ్ తుడుసు నాగార్జున మాట్లాడుతూ.. “ఈరోజు విద్యార్థులే రేపటి పౌరులు” అని పేర్కొన్నారు. ప్రతి విద్యార్థి చదువుతో పాటు పరిశుభ్రతపై కూడా అవగాహన పెంచుకోవాలని సూచించారు. తమ ఇళ్ల చుట్టూ, పాఠశాల పరిసరాల్లో చెత్తాచెదారం లేకుండా శుభ్రంగా ఉంచే విద్యార్థులను ప్రోత్సహించేందుకు తనవంతుగా రూ.500 నగదు బహుమతిని అందజేశారు.
విద్యార్థులు చిన్న వయసు నుంచే పరిశుభ్రతను అలవర్చుకుంటే గ్రామం మొత్తం పరిశుభ్రంగా మారుతుందని అన్నారు. ప్రతి ఒక్కరూ తమ ఇంటి పరిసరాలతో పాటు పాఠశాల పరిసరాలను కూడా పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు.
అదేవిధంగా పాఠశాలలో విద్యార్థులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను పరిశీలించిన సర్పంచ్.. వేసవి, వేడి వాతావరణంలో విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా పాఠశాలకు నాలుగు ఫ్యాన్లు తనవంతుగా సమకూర్చుతానని హామీ ఇచ్చారు. సర్పంచ్ స్పందనపై విద్యార్థులు, ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేస్తూ కృతజ్ఞతలు తెలిపారు.
కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, గ్రామ పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

