*BIG NEWS: కొత్త పింఛన్లపై ప్రభుత్వం క్లారిటీ.. ఎవరు అర్హులు అంటే?*
- రాష్ట్రంలో కొత్తగా మంజూరు చేయనున్న చేయూత సామాజిక భద్రత పింఛన్లపై తెలంగాణ ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. కొత్త పింఛన్ల అర్హత ప్రమాణాల్లో ఎలాంటి మార్పు చేయలేదని ప్రకటించింది. గత ప్రభుత్వాల హయాంలో 2014 నుంచి 2018 మధ్య జారీ చేసిన సంబంధిత ప్రభుత్వ ఉత్తర్వుల్లో (జీవోలు) పేర్కొన్న అర్హత నిబంధనలనే ప్రస్తుత ప్రభుత్వం కూడా ప్రామాణికంగా తీసుకోనున్నట్లు వెల్లడించింది. అర్హులైన పేదలు, బలహీన వర్గాలకు సామాజిక భద్రత కల్పించడమే లక్ష్యంగా కొత్త పింఛన్ల మంజూరు ప్రక్రియను వేగవంతం చేస్తున్నట్లు తెలిపింది.
*తొలిదశలో వీరికి పింఛన్లు*
తొలిదశలో ఒంటరి మహిళలు, వితంతువులు, దివ్యాంగులు, గీత కార్మికులు, చేనేత కార్మికులు, ఫైలేరియా బాధితులు, తలసేమియా, సికిల్ సెల్ వ్యాధి, హీమోఫీలియా వంటి రక్త సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న వారికి కొత్త పింఛన్లు మంజూరు చేయనున్నట్లు ప్రభుత్వం తెలిపింది.
*పాత దరఖాస్తులకూ అవకాశం*
ప్రజాపాలన వారోత్సవాలు, 99 రోజుల ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహించిన గ్రామసభలు, ప్రజావాణిలో ఇప్పటికే పింఛన్ల కోసం అందిన దరఖాస్తులను కూడా పరిశీలనలోకి తీసుకోనున్నారు. అయితే గతంలో దరఖాస్తు చేసి, అవసరమైన అన్ని ధ్రువపత్రాలను ఇప్పటికే సమర్పించిన వారు మళ్లీ దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. అవసరమైన పత్రాలు సమర్పించని వారు, అలాగే ఇప్పటివరకు దరఖాస్తు చేయని అర్హులు మాత్రం కొత్తగా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది.
*ధ్రువపత్రాల ఆధారంగా అర్హత పరిశీలన*
అర్హత నిర్ధారణకు అవసరమైన ధ్రువపత్రాలను సంబంధిత శాఖల నుంచి పొందేలా జిల్లా కలెక్టర్లు చర్యలు తీసుకోనున్నారు.
వితంతువులకు భర్త మరణ ధ్రువపత్రం అవసరం. ఒంటరి మహిళలకు సెపరేషన్ ధ్రువపత్రం లేదా స్థానిక విచారణ నివేదిక అవసరం. గీత కార్మికులకు** ఎక్సైజ్ శాఖ ధ్రువీకరణ అవసరం. చేనేత కార్మికులకు చేనేత-జౌళి శాఖ ధ్రువీకరణ అవసరం. ఫైలేరియా బాధితులకు వైద్య ఆరోగ్య శాఖ ధ్రువీకరణ అవసరం. ఇతర కేటగిరీలకు కూడా వారి అర్హతను నిర్ధారించే సంబంధిత ధ్రువపత్రాలను పరిశీలించనున్నారు.
*క్షేత్రస్థాయి తనిఖీ తర్వాతే మంజూరు*
దరఖాస్తుల పరిశీలన అనంతరం నిర్దేశిత అధికారులు క్షేత్రస్థాయిలో అర్హతలను తనిఖీ చేస్తారు. అనంతరం అర్హుల జాబితాను జిల్లా స్థాయికి పంపిస్తారు. జిల్లా కలెక్టర్ ఆమోదం పొందిన తర్వాత పింఛన్ మంజూరు ప్రక్రియను పూర్తి చేయనున్నారు.
*ఆగస్టు 31 వరకు దరఖాస్తులు*
కొత్త చేయూత పింఛన్ల కోసం ఆగస్టు 31, 2026 వరకు దరఖాస్తులను స్వీకరించనున్నారు. దరఖాస్తులతో పాటు లబ్ధిదారుల వివరాలను చేయూత పోర్టల్‌లో నమోదు చేసే ప్రక్రియను కూడా వెంటనే చేపట్టనున్నారు. దరఖాస్తుల పరిశీలనకు సంబంధించిన కాలపరిమితులు, అర్హుల జాబితాల ఖరారు, శాంక్షన్ ప్రొసీడింగ్స్ పంపిణీ తదితర అంశాలపై మార్గదర్శకాలు, ఆదేశాలను సంబంధిత అధికారులకు విడిగా జారీ చేయనున్నారు.
👉 *ముఖ్యంగా.. కొత్తగా దరఖాస్తు చేయాల్సిన వారు ఆగస్టు 31లోగా దరఖాస్తు చేసుకోవాలి. గతంలోనే దరఖాస్తు చేసి, అవసరమైన అన్ని పత్రాలు సమర్పించిన అర్హులు మాత్రం మరోసారి దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదు.*

