24.3 C
Hyderabad
Monday, September 14, 2026

పాలిటెక్నిక్‌లపై ఉన్నతస్థాయి కమిటీ* 

Must read

📰 Generate e-Paper Clip

*పాలిటెక్నిక్‌లపై ఉన్నతస్థాయి కమిటీ*

 

*చైర్మన్‌గా కేశవరావు, సభ్యులుగా కోదండరాం, శాంతాసిన్హా తదితరులు*

 

హైదరాబాద్‌: పాలిటెక్నిక్‌ విద్యను మరింత ఆధునికీకరించడంతోపాటు విద్యార్థుల విద్య, కెరీర్‌ హక్కుల పరిరక్షణపై అధ్యయనం కోసం ప్రభుత్వం ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీ చైర్మన్‌గా ప్రభుత్వ సలహాదారు కే కేశవరావు, ఎమ్మెల్సీ ప్రొఫెసర్‌ కోదండరాం, రిటైర్డు ప్రొఫెసర్‌ శాంతా సిన్హా, విద్యుత్తుశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నవీన్‌ మిట్టల్‌తోపాటు విద్యుత్‌శాఖ కార్యదర్శిని సభ్యులుగా, సాంకేతిక విద్యాశాఖ కమిషనర్‌ను మెంబర్‌ కన్వీనర్‌గా నియమించింది. 30 రోజుల్లో సిఫారసులతో నివేదికను అందజేయాలని కమిటీని నిర్దేశించింది. భవిష్యత్తు పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా మానవ వనరులను తీర్చిదిద్దడానికి పాలిటెక్నిక్‌ విద్యను మరింత బలోపేతం చేయడం, పాఠ్యాంశాలలో మార్పులు, ఆధునిక మౌలిక సదుపాయాల ఏర్పాటు, పరిశ్రమలతో అనుసంధానం.. తద్వారా విద్యార్థులకు ఉపాధి అవకాశాలను మెరుగుపర్చాలని ప్రభుత్వం భావిస్తోంది.

 

ఈ మేరకు పాలిటెక్నిక్‌ విద్యావ్యవస్థ.. నైపుణ్యాభివృద్ధి కేంద్రంగా పని చేసేలా జూన్‌ 16న ఉత్తర్వులను జారీ చేసింది. అయితే పాలిటెక్నిక్‌ విద్యను, స్కిల్‌ డెవల్‌పమెంట్‌ కార్యక్రమాన్ని ఒకే గొడుగు కిందకు తీసుకురావడంపై పాలిటెక్నిక్‌ విద్యార్థులు, అధ్యాపకులు, ఉద్యోగులలో ఆందోళన మొదలైంది. పాలిటెక్నిక్‌ విద్యను ప్రభుత్వం ఏం చేయబోతోంది, ఉద్యోగ అవకాశాలు ఎలా ఉంటాయి? తదితర సందేహాలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలోనే సమగ్ర అధ్యయనం కోసం ఉన్నత స్థాయి కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కాగా, రాష్ట్రంలో ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలల ప్రైవేటీకరణ చర్యలను ఆపాలని సీపీఎం డిమాండ్‌ చేసింది. పేద, మధ్య తరగతి విద్యార్థులకు అందుబాటులో ఉన్న సాంకేతిక విద్యను బలహీనపరచడం సరికాదని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి జాన్‌ వెస్లీ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జీవో 97ను తక్షణం రద్దు చేసి, పాలిటెక్నిక్‌ విద్యను రాష్ట్ర సాంకేతిక విద్యలోనే కొనసాగించాలని డిమాండ్‌ చేశారు..

More articles

Latest article

App Icon

Install DT News App

Add to home screen for faster loading and latest updates.