ప్రభుత్వ పథకాల అసలు లక్ష్యం చివరి లబ్ధిదారుడికి చేరినప్పుడే అభివృద్ధికి అర్థం.
ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలు మారడం సహజం. పాలకులు మారుతారు.. విధానాలు మారుతాయి.. ప్రాధాన్యతలు మారుతాయి. కానీ ప్రజల అవసరాలు మాత్రం కొనసాగుతూనే ఉంటాయి. సామాన్యుడికి కావాల్సింది ఏ ప్రభుత్వం అధికారంలో ఉందన్నది కాదు.. తనకు అవసరమైన సమయంలో ప్రభుత్వ సేవ అందుతుందా లేదా అన్నదే.
ఆసుపత్రిలో వైద్యం అందాలి.. పాఠశాలలో నాణ్యమైన విద్య లభించాలి.. రహదారి సక్రమంగా ఉండాలి.. తాగునీరు అందాలి.. ప్రభుత్వ కార్యాలయంలో పని సకాలంలో పూర్తవ్వాలి. ఇవే ప్రజల ప్రాథమిక అంచనాలు.
ప్రభుత్వాలు ఎన్నో సంక్షేమ పథకాలను ప్రకటిస్తుంటాయి. బడ్జెట్లు కేటాయిస్తుంటాయి. అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు జరుగుతాయి. ప్రారంభోత్సవాలు జరుగుతాయి. కానీ ఆ పథకం వల్ల నిజంగా ఎంతమంది ప్రజలకు ప్రయోజనం కలిగింది? ఎంతమంది అర్హులు లబ్ధి పొందారు? ఎక్కడైనా మధ్యవర్తుల జోక్యం ఉందా? అధికారుల నిర్లక్ష్యం కారణంగా అర్హులు నష్టపోతున్నారా? అనే ప్రశ్నలకు కూడా సమాధానం వెతకాల్సిన అవసరం ఉంది.

