*శ్రావణమాసంలో కేబినెట్ ప్రక్షాళనకు రంగం సిద్ధం..!!*
*సురేఖ తో పాటు మరో ఇద్దరికి ఉద్వాసన..???*
కాంగ్రెస్ పార్టీలో నెలకొన్న తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో శ్రావణ మాసంలో కేబినెట్ పునర్వ్యవస్థీకరణ ఉంటుందని ప్రచారం జోరుగా సాగుతున్నది.
ఒకరిద్దరు మంత్రులను తొలగించి, వారి స్థానంలో కొత్తవారిని మంత్రివర్గంలోకి తీసుకునే అవకాశం ఉంటుందని చర్చ జరుగుతున్నది. కేబినెట్ నుంచి తప్పించే జాబితాలో కొండా సురేఖ పేరు తప్పనిసరిగా ఉంటుందని తెలుస్తున్నది. అదేసమయంలో మంత్రుల శాఖలను సైతం మార్చేందుకు ఏఐసీసీ కసరత్తు చేస్తున్నట్టు కాంగ్రెస్ వర్గాల్లో డిస్కషన్ ఉంది.
*సెప్టెంబరు 10 వరకు తేల్చేద్దాం..!!*
సెప్టెంబరు 10 వరకు శ్రావణమాసం ఉంది. ఈలోపే కేబినెట్ పునర్‌వ్యవస్థీకరణ చేపట్టాలని ఏఐసీసీ భావిస్తున్నట్టు తెలుస్తున్నది. అయితే వర్షకాల అసెంబ్లీ సమావేశాలను సెప్టెంబరు7 నుంచి ప్రారంభించి, రెండు మూడు రోజుల పాటు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తున్నది. దీనితో పునర్వ్యవస్థీకరణ సమావేశాలలోపు చేయాలా ? లేకపోతే ఆ తరువాత చేపట్టాలా ? అనే అంశంపై ఆరా తీస్తున్నట్టు తెలిసింది. అయితే ఉన్నపళంగా కొండా సురేఖను మాత్రమే కేబినెట్ నుంచి తప్పిస్తే, మహిళా, బీసీ సామాజిక వర్గాల నుంచి వ్యతిరేకత వచ్చే ప్రమాదం ఉంటుంది. ఆమె కుమార్తె సుస్మిత సీఎం రేవంత్ రెడ్డిపై విమర్శలు చేసినందుకు ప్రతికారంగానే మంత్రి వర్గం నుంచి తొలగించారని విమర్శలు వచ్చే చాన్స్ ఉంది. అందుకని పనితీరు సరిగాలేని మంత్రులను తప్పిస్తే రాజకీయంగా విమర్శలు వచ్చే అవకాశం తక్కువగా ఉంటుందనే కోణంలో ఏఐసీసీ నేతలు ఆలోచిస్తున్నట్టు తెలుస్తున్నది. పనిలో పనిగా మంత్రుల వద్ద ఉన్న శాఖలను సైతం మార్చాలని అధిష్టానం భావిస్తున్నట్టు సమాచారం. కొందరు మంత్రులు తమ శాఖలను అడ్డంపెట్టుకుని పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడుతున్నట్టు ఫిర్యాదులు వచ్చాయి. దీనితో అటు మంత్రివర్గ రిషఫ్లింగ్, ఇటు మంత్రుల శాఖల్లో మార్పులు చేపడితే పాలన వ్యవహారంలో భాగంగా మార్పులు, చేర్పులు చేశారని సంకేతాలు వెళ్తాయని అధిష్టానం ఆలోచన చేస్తున్నట్టుగా తెలిసింది.
*ఒ(త)ప్పించే బాధ్యత ఏఐసీసీ పైనే..!!*
కేబినెట్ నుంచి తప్పించే మంత్రుల జాబితాను ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి అధిష్టానం ముందు పెట్టినట్టు తెలిసింది. సదరు మంత్రులను తప్పించేందుకు ఉన్న కారణాలను సైతం వివరించినట్టు సమాచారం. ఆ మంత్రులతో రాజీనామా చేయించే బాధ్యతలను మాత్రం ఏఐసీసీ పెద్దలు తీసుకునే చాన్స్ ఉందని తెలిసింది. రాజీనామాకు ఒప్పుకోకపోతే నయానో, భయానో దారిలోకి తెచ్చుకునే అవకాశం ఉంది. అయినా ఒప్పుకోకపోతే మాత్రం అప్పుడు బర్తరఫ్ అస్త్రాన్ని ప్రయోగించే అవకాశం ఉంటుందని ఏఐసీసీకి సన్నిహితంగా ఉండే ఓ నేత అభిప్రాయపడ్డారు. అయితే పదవి కోల్పోయిన తరువాత సదరు లీడర్లు మౌనంగా ఉంటారా ? ప్రభుత్వంపై ప్రతిరోజు విమర్శలు చేస్తే ఎలా ?అనే కోణంలో కూడా ఆరా తీస్తున్నారు. అందుకని కేబినెట్ ప్రక్షాళన తరువాత తలెత్తే రాజకీయ పరిణామాలను సైతం అంచనా వేసి, వాటిని కౌంటర్ చేసేందుకు కూడా వ్యూహరచన చేస్తున్నట్టు తెలిసింది.
*ప్రక్షాళన చేయకుంటే పట్టుతప్పేలా ఉంది..!!*
మొన్నటి వరకు కేబినెట్ విస్తరణ అవసరం లేదని అటు కాంగ్రెస్ హైకమాండ్, ఇటు రాష్ట్రనేతలు భావించారు. మంత్రివర్గంలో ఖాళీగా ఉన్న రెండు బెర్తులను నింపడం పెద్ద సవాలుగా మారింది. ఎందుకంటే మంత్రి పదవులు ఆశిస్తోన్న ఎమ్మెల్యేల జాబితా చాలా పెద్దగా ఉండటంతో ఎవరిని సంతృప్తి పరచాలో అర్థం కాక మౌనంగా ఉన్నారు. కానీ కొండా సురేఖ కుమార్తె సృష్టించిన వివాదానికి తెర పడాలంటే కేబినెట్ పునర్వ్యవస్థీకరణ తప్పదని నిర్ణయానికి వచ్చినట్టు తెలిసింది. కేబినెట్‌లోకి కొత్తగా మున్నూరు కాపు, ఓసీ సామాజిక వర్గంతో పాటు ఎస్టీ సామాజిక వర్గం వారికి అవకాశం దక్కునుంది. *పనిలో పనిగా వర్షకాల సమావేశాల్లో పెండింగ్ లో ఉన్న డిప్యూటీ స్పీకర్ ఎన్నికను సైతం పూర్తి చేయాలని భావిస్తున్నారు.* సామాజిక,జిల్లాల సమతుల్యతను దృష్టిలో పెట్టుకుని కేబినెట్ పునర్వ్యవస్థీకరణ, డిప్యూటీ స్పీకర్ ఎన్నిక జరగనుంది.

