మట్టి మాఫియాపై చర్యలేవి?
గ్రామాల మీదుగా హెవీ టిప్పర్ల హల్చల్.. దుమ్ము, ధూళితో ప్రజల అవస్థలు!
కొత్త సీసీ రోడ్లపై భారీ టిప్పర్ల రాకపోకలు.. రోడ్లు దెబ్బతింటాయని గ్రామస్తుల ఆందోళన
అనుమతులు ఉన్నాయా? లేదా? పట్టించుకోని సంబంధిత అధికారులు!
బోనకల్, అక్టోబర్ 11 (దేశ టైమ్స్):
బోనకల్ మండల పరిధిలోని లక్ష్మీపురం, గోవిందపురం గ్రామాల నుంచి అనుమతులు లేకుండానే భారీ టిప్పర్ల ద్వారా మట్టి తరలిస్తున్నారనే ఆరోపణలు స్థానికంగా చర్చనీయాంశంగా మారుతున్నాయి. పట్టపగలే గ్రామాల గుండా హెవీ టిప్పర్లు భారీగా సంచరిస్తుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాహనాల రాకపోకలతో దుమ్ము, ధూళి వ్యాపించడంతో పాటు, అధిక వేగంతో ప్రయాణించే టిప్పర్ల వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ప్రజాధనంతో నిర్మించిన సీసీ రోడ్లకు ముప్పు!
ఇటీవల ప్రజాధనంతో నిర్మించిన రావినూతల గ్రామంలోని సీసీ రోడ్లపై సిక్స్ ఆక్సిల్ భారీ టిప్పర్లు నిరంతరం రాకపోకలు సాగిస్తుండటంపై స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. భారీ వాహనాల రాకపోకల కారణంగా కొత్తగా నిర్మించిన రోడ్లు దెబ్బతింటే, అందుకు బాధ్యత ఎవరు వహిస్తారని ప్రశ్నిస్తున్నారు. లక్షలాది రూపాయల ప్రజాధనంతో నిర్మించిన రహదారులను కాపాడాల్సిన బాధ్యత అధికారులపై లేదా? అంటూ నిలదీస్తున్నారు.
మట్టి తరలింపునకు అనుమతులు ఉన్నాయా?
మట్టి తవ్వకాలు, తరలింపునకు సంబంధించి అవసరమైన అనుమతులు ఉన్నాయా? లేదా? అనే అంశంపై రెవెన్యూ, గనుల శాఖ అధికారులు సమగ్రంగా విచారణ చేపట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా మట్టి తవ్వకాలు లేదా రవాణా జరుగుతున్నట్లు తేలితే బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
అధికారులు స్పందించేదెప్పుడు?
గ్రామాల గుండా భారీ టిప్పర్ల రాకపోకలను నియంత్రించాలని, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. దుమ్ము, ధూళి సమస్యకు పరిష్కారం చూపడంతో పాటు, గ్రామీణ రహదారులు దెబ్బతినకుండా సంబంధిత శాఖలు పర్యవేక్షణ చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
ఇప్పటికైనా అధికారులు స్పందించి క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహించి, మట్టి తరలింపునకు సంబంధించిన అనుమతులను పరిశీలించి, అక్రమాలు ఉన్నట్లు నిర్ధారణ అయితే చర్యలు తీసుకుంటారా? లేక గ్రామస్తుల ఆందోళనలను పట్టించుకోకుండా వదిలేస్తారా? అన్నది వేచి చూడాల్సి ఉంది.

