23.5 C
Hyderabad
Sunday, October 25, 2026

దేశంలో సమస్యల తీరు మారింది: పి. ప్రసాద్

Must read

📰 Generate e-Paper Clip

దేశంలో సమస్యల తీరు మారింది: పి. ప్రసాద్

 

జన్‌జీ ఆందోళనలు ప్రజా ఉద్యమంగా మారాలి

 

ఐక్యత, ఐక్య కార్యాచరణ దిశగా అడుగులు: ఐఎఫ్‌టీయూ జాతీయ నే

 

ఖమ్మం ప్రతినిధి, సెప్టెంబర్ 28 (దేశ టైమ్స్):

 

భారతదేశంలో సమస్యల స్వరూపం మారిందని, గతంలో ఆకలి ప్రధాన సమస్యగా ఉండగా ప్రస్తుతం నిరుద్యోగం, ఆర్థిక అసమానతలు, కార్పొరేటీకరణ తదితర అంశాలు ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయని ఐఎఫ్‌టీయూ జాతీయ నాయకులు పి. ప్రసాద్ అన్నారు. దేశంలో ప్రజాస్వామ్య హక్కులను పరిరక్షించేందుకు బలమైన ప్రజా ఉద్యమాలను నిర్మించాల్సిన అవసరం ఉందన్నారు.

 

టీయూడబ్ల్యూజే (ఐజేయూ) ఖమ్మం ప్రెస్‌క్లబ్ ఆధ్వర్యంలో సోమవారం స్థానిక ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన ‘మీట్ ద ప్రెస్’ కార్యక్రమంలో ప్రసాద్ పాల్గొని మాట్లాడారు. కార్యక్రమానికి టీయూడబ్ల్యూజే (ఐజేయూ) జిల్లా అధ్యక్షుడు ఏనుగు వెంకటేశ్వరరావు మోటివేటర్‌గా వ్యవహరించగా, ప్రెస్‌క్లబ్ అధ్యక్షుడు నామ పురుషోత్తం సభాధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా టీయూడబ్ల్యూజే (ఐజేయూ) రాష్ట్ర కార్యదర్శి కె. రాంనారాయణ హాజరయ్యారు.

 

ప్రస్తుత సామాజిక, ఆర్థిక పరిస్థితులను వివరించిన ప్రసాద్, రైతులు, కార్మికులు తమ సమస్యలపై ఉద్యమాలు నిర్వహిస్తున్నారని తెలిపారు. ప్రజాస్వామిక శక్తులు కూడా భవిష్యత్‌లో ప్రజా సమస్యలపై ఉద్యమాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. యువత తరగతి గదులు, కార్యాలయాలకే పరిమితమవుతోందనే అభిప్రాయాల మధ్య ఇటీవలి యువజన ఉద్యమాలు ప్రశ్నించే తత్వాన్ని పెంచుతున్నాయని పేర్కొన్నారు.

 

జన్‌జీ ఉద్యమం కేవలం నీట్ ప్రశ్నాపత్రం లీక్ అంశానికే పరిమితం కాదని, నిరుద్యోగం, ఆర్థిక పరిస్థితులు, కార్పొరేటీకరణ వంటి సామాజిక అంశాలు కూడా ప్రభావం చూపాయని ప్రసాద్ అన్నారు. ఈ ఉద్యమాన్ని ప్రజా ఉద్యమంగా విస్తరించాల్సిన అవసరం ఉందన్నారు. వామపక్ష పార్టీలు, ప్రజాస్వామ్య శక్తులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

 

వామపక్ష సిద్ధాంతం బలమైనదని, ప్రజా సమస్యలపై పోరాటాల ద్వారా ఆ సిద్ధాంతం బలపడిందని ఆయన పేర్కొన్నారు. ఉద్యమాల్లో ఏర్పడే చీలికలు వాటిని బలహీనపరుస్తాయని, సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ భావజాలానికి దగ్గరగా ఉన్న శక్తులను ఐక్యం చేసే ప్రయత్నాలు కొనసాగుతున్నాయని తెలిపారు. ఐక్యత సాధ్యం కాని పరిస్థితుల్లోనైనా ఐక్య కార్యాచరణ దిశగా ముందుకు వెళ్తున్నామని చెప్పారు.

 

దేశ ఆర్థిక పరిస్థితులపై మాట్లాడుతూ ఉత్పత్తి పెరుగుతున్నప్పటికీ వినియోగం తగ్గడం ఆందోళనకరమన్నారు. విదేశీ దేశాల నుంచి దిగుమతుల కోసం వస్తున్న ఒత్తిళ్లు భవిష్యత్‌లో వ్యవసాయంతో పాటు ఇతర రంగాలపై ప్రభావం చూపే అవకాశం ఉందన్నారు. వ్యవసాయ రంగంలో కార్పొరేట్ సంస్థల ప్రవేశం పెరుగుతోందని, భవిష్యత్‌లో మరింత కార్పొరేటీకరణ జరిగే ప్రమాదం ఉందని పేర్కొన్నారు.

 

దేశ ఆర్థిక వృద్ధిపై కేంద్ర ప్రభుత్వం చెబుతున్న గణాంకాలను ప్రసాద్ విమర్శించారు. సంపద కొద్దిమంది వద్ద కేంద్రీకృతమవుతుండగా పేదరికం, ఆర్థిక అసమానతలు కొనసాగుతున్నాయని ఆయన అన్నారు.

 

మావోయిస్టు పార్టీ భవిష్యత్తుపై ప్రశ్నించగా, అది పూర్తిగా అంతం కాలేదని ప్రసాద్ అభిప్రాయపడ్డారు. ప్రజలను భౌతికంగా పోరాటాలకు సిద్ధం చేయకుండా చేపట్టే ఏ ఉద్యమమూ విజయవంతం కాదన్నారు. పాలకుల విధానాలకు వ్యతిరేకంగా ప్రజల్లో అవగాహన కల్పించేందుకు వామపక్ష శక్తులు కృషి చేస్తున్నాయని తెలిపారు.

 

యువతలో గతంతో పోలిస్తే ఇటీవల ప్రశ్నించే ధోరణి పెరుగుతోందని, ఉదాసీన వైఖరి నుంచి సామాజిక, రాజకీయ అంశాలపై స్పందించే దిశగా మార్పు కనిపిస్తోందని ప్రసాద్ అన్నారు. ఈ పరిణామాన్ని రాజకీయ పార్టీలు, సామాజిక శక్తులు స్వాగతించాలని కోరారు.

More articles

Latest article

App Icon

Install DT News App

Add to home screen for faster loading and latest updates.