హైదరాబాద్: తెలంగాణలో ఎంబీబీఎస్ ప్రవేశాల్లో నకిలీ ఎస్టీ సర్టిఫికెట్ల వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఇతర రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు నకిలీ ఎస్టీ సర్టిఫికెట్లను ఉపయోగించి రిజర్వేషన్ కోటాలో ఎంబీబీఎస్ సీట్లు పొందేందుకు దరఖాస్తు చేసుకున్నట్లు కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీ గుర్తించింది.
మహారాష్ట్ర, రాజస్థాన్, కర్ణాటకకు చెందిన విద్యార్థులు అధికారులకు లంచాలు ఇచ్చి నకిలీ ఎస్టీ ధ్రువపత్రాలు పొందినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ సర్టిఫికెట్ల ఆధారంగా రిజర్వేషన్ కోటాలో ఎంబీబీఎస్ సీట్ల కోసం దరఖాస్తు చేసుకున్న 37 మంది ఇతర రాష్ట్రాల విద్యార్థులను అధికారులు గుర్తించినట్లు సమాచారం.
వీరిలో ఇప్పటికే 9 మందికి ఎంబీబీఎస్ సీట్లు కేటాయించగా, ఆయా సీట్లను కూడా రద్దు చేయనున్నట్లు యూనివర్సిటీ ప్రకటించింది. మిగిలిన అభ్యర్థుల ధ్రువపత్రాలను కూడా పరిశీలించి తదుపరి చర్యలు తీసుకునే అవకాశం ఉంది.
నకిలీ ధ్రువపత్రాల వ్యవహారంపై అధికారులు మరింత లోతుగా విచారణ చేపట్టే అవకాశం ఉంది. రిజర్వేషన్ ప్రయోజనాలను అర్హులైన విద్యార్థులకే అందేలా ధ్రువపత్రాల పరిశీలనను కఠినతరం చేయనున్నట్లు తెలుస్తోంది.

