27.9 C
Hyderabad
Monday, September 14, 2026

బంగారం దొంగతనం కేసులో అరెస్టు అయిన ఓ వ్యక్తి మృతి చెందడం కలకలం రేపింది.*

Must read

📰 Generate e-Paper Clip

*బంగారం దొంగతనం కేసులో అరెస్టు అయిన ఓ వ్యక్తి మృతి చెందడం కలకలం రేపింది.*

 

పోలీసులు కొట్టిన దెబ్బలకే మృతి చెందాడని కుటుంబీకులు ఆరోపిస్తుండగా.. తాము 41 నోటీసు ఇచ్చి విడిచిపెట్టామని పోలీసులు చెబుతున్నారు. అదుపులోకి తీసుకుని నాలుగు రోజులు చిత్రహింసలకు గురిచేశారని మృతుడి బంధువులు చెబుతున్నారు. మృతుడి అన్న బండారు సతీష్‌, ఇతర కుటుంబీకుల వివరాల మేరకు.. విజయనగరం జిల్లా రామభద్రపురం మండలం కొండకెంగువ గ్రామానికి బండారు మణికంఠ (24) వెల్డింగ్‌ పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అయితే ఇతనికి పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మండలం గుమడాం గ్రామానికి చెందిన ఓ వ్యక్తి పరిచయమయ్యాడు. ఆరు నెలల కిందట ఆ వ్యక్తి బంగారం దొంగతనం చేసి చోరీ సొత్తును విక్రయించి మణికంఠ అకౌంట్‌లో రూ.3.5 లక్షలు జమ చేశాడు. చోరీ చేసిన ఆ వ్యక్తిని సాలూరు టౌన్‌ పోలీసులు అరెస్టు చేసి విచారణ చేయగా అతను బండారు మణికంఠ పేరు చెప్పారు. దీంతో పోలీసులు ఇతడ్ని కూడా నిందితుడిగా చేర్చి విచారించారు. 10 రోజుల క్రితం మణికంఠను పోలీసులు తీసుకుని వెళ్లి నాలుగు రోజుల పాటు చిత్రహింసలు పెట్టారని, తీవ్ర గాయాలు కావడంతో విజయనగరంలోని ఓ ఆసుపత్రిలో చికిత్స చేయించారని మృతుడు అన్న సతీష్‌ ఆరోపించారు. అప్పటికే మణికంఠకు టైఫాయిడ్‌, మలేరియా ఉన్నాయని, దీంతోపాటు పోలీసుల దెబ్బలకు అతని ఆరోగ్యం మరింత క్షీణించిందని, తమకు సమాచారం అందడంతో విజయనగరంలో ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స చేయించామని, చికిత్స పొందుతూ మణికంఠ మృతి చెందాడని విలేకరుల ఎదుట వాపోయాడు. చనిపోవడానికి నాలుగు రోజుల ముందు పోలీసులు ఆసుపత్రికి వచ్చి తమతో సంతకాలు చేయించుకున్నారని, దీంతో తమకు మరింత అనుమానం వచ్చిందని అన్నారు. పోలీసులు థర్డ్‌ డిగ్రీ ప్రయోగించి తన తమ్ముడిని పొట్టన పెట్టుకున్నారని ఆరోపించారు. మృతదేహాన్ని కొండకెంగువ గ్రామానికి తీసుకెళ్లగా తల్లి బండారు అనూరాధ, బంధువులు భోరున విలపించారు.పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలిచ్చారు. వీరికి కొందరు గ్రామస్థులు కూడా సంఘీభావం తెలిపారు. తన కుమారుడు మృతికి కారణమైన పోలీసులపై కఠినమైన చర్యలు తీసుకోవాలని తల్లి డిమాండ్‌ చేశారు.

 

సాలూరు పోలీసులు ఏమంటున్నారంటే..

 

ఈ ఘటనపై సాలూరు పోలీసులు ఇలా చెబుతున్నారు. ఈ నెల 9వ తేదీ ఆదివారం బంగారు ఆభరణాలు, వాహనాలు, సెల్‌ఫోన్లు దొంగతనం కేసులో ఏ-2గా ఉన్న బండారు మణికంఠను పోలీసులు అరెస్టు చేశారు. ఆదివారం రిమాండ్‌కు తరలించే క్రమంలో వైద్య పరీక్షలు చేయగా పూర్తి ఆరోగ్యంగా లేడని వైద్యులు ధ్రువీకరించారు. దీంతో 41 నోటీసు ఇచ్చి నిందితుడిని విడిచిపెట్టామని పోలీసులు చెబుతున్నారు.

అనారోగ్యంతోనే మణికంఠ మృతి

 

సాలూరులో లాకప్‌డెత్‌ అనేది అవాస్తవం

 

స్పష్టం చేసిన ఎస్పీ మాధవ్‌రెడ్డి

 

ఒక చోరీ కేసులో ఏ3 నిందితుడిగా ఉన్న బండారు మణికంఠ సాలూరు పోలీసుల చిత్రహింసలతో మృతి చెందాడని జరుగుతున్న ప్రచారం అవాస్తవమని మన్యం జిల్లా ఎస్పీ మాధవరెడ్డి తెలిపారు. సోమవారం ఆయన ఈ విషయమై విలేకరులతో మాట్లాడుతూ ‘సాలూరు పోలీస్‌స్టేషన్‌లో ఏప్రిల్‌ 12న సబ్బాన బలరాం అనే వ్యక్తి ఇంటిలో చోరీ జరిగినట్టు కేసు నమోదైంది. ఈ చోరీలో 30 గ్రాములు బంగారం రూ.10 వేల నగదు చోరీకి గురైనట్టు ఫిర్యాదు చేశారు. సాలూరుకు చెందిన ప్రధాన నిందితుడు రాంబరికి యుగంధర్‌ ఏ1గా, చిడిగిడి మహేష్‌ ఏ2, మణికంఠను ఏ3గా ఈ నెల 11న అరెస్టు చేశాం. రిమాండ్‌కు తరలించేటప్పుడు వారికి వైద్య పరీక్షలు నిర్వహించగా ఏ3గా ఉన్న మణికంఠకు జ్వరమని తేలింది. వెంటనే మణికంఠ సోదరుడికి నోటీసు ఇచ్చి అప్పగించాము. వారి బంధువులు మణికంఠను రెండు రోజుల తర్వాత జ్వరం తీవ్రత ఎక్కువ కావడంతో విజయనగరంలోని ఒక ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం మణికంఠ మృతి చెందాడు. పోలీసులు చిత్రహింసలు పెట్టడంతోనే మణికంఠ మృతి చెందాడనేది అవాస్తవం. అనారోగ్య కారణాలతోనే మణికంఠ మృతి చెందాడు. మణికంఠపై గతంలో రామభ ద్రపురం పోలీస్‌స్టేషన్‌లో కేసులు నమోదై ఉన్నాయి’ అని తెలిపారు.

More articles

Latest article

App Icon

Install DT News App

Add to home screen for faster loading and latest updates.