27.5 C
Hyderabad
Sunday, October 25, 2026

మరిపెడలో నూతన న్యాయస్థానం ప్రారంభం

Must read

📰 Generate e-Paper Clip

మరిపెడలో నూతన న్యాయస్థానం ప్రారంభం

 

బార్‌–బెంచ్‌ సమన్వయంతో ప్రజలకు సత్వర న్యాయం అందించాలి

 

హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఈవీ వేణుగోపాల్‌

 

దేశ టైమ్స్ 

మహబూబాబాద్‌ మరిపెడ, సెప్టెంబర్‌ 19:

 

 

 

మహబూబాబాద్‌ జిల్లా మరిపెడ మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన జూనియర్‌ సివిల్‌ జడ్జి, జ్యుడీషియల్‌ మెజిస్ట్రేట్‌ ఆఫ్‌ ఫస్ట్‌ క్లాస్‌ కోర్టు భవనం ప్రారంభోత్సవ కార్యక్రమం శనివారం ఘనంగా నిర్వహించారు. హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ ఈవీ వేణుగోపాల్‌, జస్టిస్‌ ఎన్‌.రాజేశ్వరరావు, జస్టిస్‌ బీఆర్‌.మధుసూదనరావు నూతన కోర్టు భవనాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా జస్టిస్‌ ఈవీ వేణుగోపాల్‌ మాట్లాడుతూ.. న్యాయవ్యవస్థను ప్రజలకు మరింత చేరువ చేయడంతో పాటు పెండింగ్‌ కేసుల పరిష్కారంలో వేగం తీసుకురావడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. బార్‌, బెంచ్‌ మధ్య సమన్వయం ఉంటేనే న్యాయవ్యవస్థ మరింత సమర్థవంతంగా పనిచేస్తుందని పేర్కొన్నారు.

న్యాయవాదులు ఆఫీసర్‌ ఆఫ్‌ ది కోర్టుగా వ్యవహరిస్తూ న్యాయస్థానానికి సహకరించాలని సూచించారు. కేసులకు సంబంధించిన చట్టపరమైన అంశాలను సమగ్రంగా కోర్టు దృష్టికి తీసుకురావాలని అన్నారు. న్యాయమూర్తులు ప్రతి కేసును క్షుణ్ణంగా పరిశీలించి, చట్టపరమైన అంశాలను అధ్యయనం చేసిన అనంతరం తీర్పులు వెలువరిస్తారని తెలిపారు.

తాను న్యాయవాదిగా ఉన్న సమయంలో ఎదుర్కొన్న ఓ కేసు అనుభవాన్ని ఈ సందర్భంగా ఆయన వివరించారు. కోర్టు ఇచ్చిన తీర్పును అనంతరం పూర్తిగా అధ్యయనం చేసినప్పుడు, తాను వాదన సమయంలో ప్రస్తావించలేకపోయిన ఓ ముఖ్యమైన అంశాన్ని గుర్తించానని తెలిపారు. న్యాయవృత్తిలో నిరంతర అధ్యయనం, ఆత్మపరిశీలన ఎంతో ముఖ్యమని ఈ అనుభవం తెలియజేస్తుందని అన్నారు.

 

*రాజ్యాంగ హక్కులు అందరికీ అందాలి*

 

భారత రాజ్యాంగం ప్రతి పౌరుడికి కల్పించిన ప్రాథమిక హక్కులు, న్యాయపరమైన రక్షణలు అందరికీ సమానంగా అందేలా చూడాల్సిన బాధ్యత న్యాయవ్యవస్థతో పాటు బార్‌, కార్యనిర్వాహక వ్యవస్థ, పౌరులపైనా ఉందన్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 14, 19, 21, 51A స్ఫూర్తిని ప్రజలకు చేరువ చేయాల్సిన అవసరం ఉందన్నారు.

సమాజంలోని బలహీన వర్గాలు, ఆశ్రయ గృహాల్లోని పిల్లలు, ఇతర అవసరమైన వర్గాలకు చట్టపరమైన రక్షణ, సంక్షేమ సేవలు అందేలా న్యాయవ్యవస్థ, కార్యనిర్వాహక వ్యవస్థ సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

 

*న్యాయస్థాన మౌలిక వసతులకు ప్రాధాన్యం*

 

న్యాయవ్యవస్థపై పెరుగుతున్న పని భారాన్ని సమర్థవంతంగా నిర్వహించేందుకు తగిన కోర్టు భవనాలు, సిబ్బంది, సాంకేతిక సదుపాయాలు, ఇతర మౌలిక వసతులు అవసరమని న్యాయమూర్తి పేర్కొన్నారు. జిల్లాల పునర్వ్యవస్థీకరణ నేపథ్యంలో కొత్త జిల్లాలకు అనుగుణంగా న్యాయస్థాన మౌలిక వసతులను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు న్యాయస్థానాలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు సహకరించాలని కోరారు.

 

*త్వరలో మహబూబాబాద్‌ జిల్లా కోర్టుకు శంకుస్థాపన*

 

వరంగల్‌ జిల్లా నుంచి విడిపోయి ఏర్పడిన మహబూబాబాద్‌ జిల్లాకు పూర్తిస్థాయి జిల్లా కోర్టు భవనం అవసరం ఉందని జస్టిస్‌ ఈవీ వేణుగోపాల్‌ అన్నారు. మహబూబాబాద్‌ జిల్లా కోర్టు భవనానికి త్వరలోనే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి చేతుల మీదుగా శంకుస్థాపన జరిగేలా చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు.

ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్‌, పోలీసు అధికారులు, న్యాయవ్యవస్థ అధికారులు, ఇతర సంబంధిత శాఖల సమన్వయం అవసరమని అన్నారు.

 

*జిల్లా కలెక్టర్‌ కృషికి అభినందనలు*

 

న్యాయస్థాన మౌలిక సదుపాయాల అభివృద్ధి, ప్రజలకు మెరుగైన సేవలు అందించడంలో జిల్లా కలెక్టర్‌ స్నేహ శబరీష్‌ చూపుతున్న నిబద్ధతను జస్టిస్‌ ఈవీ వేణుగోపాల్‌ అభినందించారు. మరిపెడలో నూతన న్యాయస్థానం ఏర్పాటుకు సహకరించిన జిల్లా కలెక్టర్‌, జిల్లా పోలీసు అధికారులు, జిల్లా ప్రధాన న్యాయమూర్తి డీకే మురళీమోహన్‌, ఇతర న్యాయమూర్తులు, కోర్టు సిబ్బంది, బార్‌ అసోసియేషన్‌ అధ్యక్ష, కార్యదర్శులు, న్యాయవాదులకు కృతజ్ఞతలు తెలిపారు.

 

*న్యాయసేవలు వేగంగా అందించాలి*

 

జస్టిస్‌ ఎన్‌.రాజేశ్వరరావు, జస్టిస్‌ బీఆర్‌.మధుసూదనరావు మాట్లాడుతూ.. మహబూబాబాద్‌ జిల్లాలో నూతన కోర్టు భవనం ప్రారంభించడం సంతోషకరమన్నారు. ప్రజలకు న్యాయసేవలు త్వరితగతిన అందేలా కోర్టు వ్యవస్థ పనిచేయాలని సూచించారు. చారిత్రక ప్రాధాన్యం కలిగిన మరిపెడలో న్యాయస్థానం ఏర్పాటు కావడం విశేషమని పేర్కొన్నారు. తమ స్వస్థల జిల్లాలో న్యాయ సేవలకు సంబంధించిన అనుభవాలను ఈ సందర్భంగా వారు గుర్తుచేసుకున్నారు.

 

*న్యాయమూర్తులకు ఘన స్వాగతం*

 

కోర్టు భవనం ప్రారంభోత్సవానికి హాజరైన హైకోర్టు న్యాయమూర్తులకు అంతకుముందు మరిపెడ ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో ప్రభుత్వ విప్‌ డాక్టర్‌ జాటోత్‌ రామచంద్రునాయక్‌, జిల్లా కలెక్టర్‌ స్నేహ శబరీష్‌, జిల్లా ఎస్పీ డాక్టర్‌ శబరీష్‌ మర్యాదపూర్వకంగా స్వాగతం పలికి పుష్పగుచ్ఛాలు అందజేశారు.

కార్యక్రమంలో ప్రిన్సిపల్‌, సీనియర్‌, జూనియర్‌ న్యాయమూర్తులు డీకే మురళీమోహన్‌, శాలిని షాకెల్లి, స్వాతి మురారి, కృష్ణతేజ్‌, ధీరజ్‌కుమార్‌, జీవన్‌కుమార్‌, మహతి వైష్ణవి, అఖిల, దిలీప్‌కుమార్‌ నాయక్‌, సూర్యచంద్రకళ, క్యాన్‌లాల్‌, చండేశ్వరీదేవి, జ్యోత్స్న తదితరులు పాల్గొన్నారు.

 

అలాగే జిల్లా కలెక్టర్‌ స్నేహ శబరీష్‌, ఎస్పీ డాక్టర్‌ శబరీష్‌, వివిధ జిల్లాల బార్‌ అసోసియేషన్‌ అధ్యక్ష, కార్యదర్శులు, సీనియర్‌ న్యాయవాదులు, న్యాయస్థాన సిబ్బంది, అధికారులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

More articles

Latest article

App Icon

Install DT News App

Add to home screen for faster loading and latest updates.