26.5 C
Hyderabad
Monday, September 14, 2026

** లాటిన్ అమెరికా రైట్ వింగ్ కు మొగ్గు చూపడం వెనుక ఏమిటి? 

Must read

📰 Generate e-Paper Clip

అంతర్జాతీయం

 

** లాటిన్ అమెరికా రైట్ వింగ్ కు మొగ్గు చూపడం వెనుక ఏమిటి?

  – పాబ్లో మేరిగ్వెట్

The Wire Editorial Team

August 8, 2026

 

Reading Time: 4 minutes

 

లాటిన్ అమెరికాలో Extreme Right, “New Right” ఆవిర్భావం, యునైటెడ్ స్టేట్స్ ప్రభావం, నయా ఉదారవాదం (Neoliberalism), వామపక్షాలు అలాగే ప్రగతిశీల ఉద్యమాలు ఎదుర్కొంటున్న సవాళ్లపై ఈక్వడోరియన్ ప్రొఫెసర్ మిగ్యుయెల్ రూయిజ్‌తో ఇంటర్వ్యూ.

 

లాటిన్ అమెరికాలో “కుడిపక్షం”, “నూతన కుడిపక్షం” బలపడటం తిరుగులేని నిజం. ఒకే విధమైన వ్యక్తిత్వ లక్షణాలు (వివాదాస్పద, ఆడంబరమైన, తరచుగా మిలియనీర్లు అయిన) ఉన్న అభ్యర్థులు ఇప్పటికే తమ అజెండాను అమలు చేశారు. వారు భద్రత, గరిష్ట భద్రతా కారాగారాలు, యునైటెడ్ స్టేట్స్, దాని మిత్రదేశాలతో సైనిక సహకారం, అలాగే 20వ శతాబ్దం చివరలో, 21వ శతాబ్దం ప్రారంభంలో ఈ ప్రాంతం ఇప్పటికే అనుభవించిన అత్యంత విచ్చలవిడి నయా ఉదారవాద నమూనాను తిరిగి పునరుద్ధరిస్తామని వాగ్దానం చేస్తున్నారు.

 

20వ శతాబ్దం చివరలో మరియు 21వ శతాబ్దం ప్రారంభంలో నయా ఉదారవాదం ఉద్భవించిన తరువాత, కేంద్ర-వామపక్ష, వామపక్ష ప్రభుత్వాల ప్రవాహం ఘనమైన ఎన్నికల విజయాలను సాధించింది. ఇది “ప్రగతిశీల” లేదా “పోస్ట్-నయా ఉదారవాద” చక్రంగా పిలువబడింది. ఇది కేన్సియన్ (Keynesian) ఆర్థిక సంస్కరణలు, సోషల్ డెమోక్రటిక్ ప్రజా విధానం, వామపక్ష ఉదారవాదానికి అనుగుణంగా ఉన్న చట్టాలను మిళితం చేసింది. వెనిజులా, బొలీవియా, ఈక్వడార్, చిలీ, బ్రెజిల్, అర్జెంటీనా, ఉరుగ్వే, పరాగ్వే దేశాలు స్పష్టంగా కేంద్ర-వామపక్షం వైపు మళ్లి, ప్రాంతీయ సమైక్యతను, మౌలిక సదుపాయాల అభివృద్ధిని ప్రోత్సహించాయి.

 

ఈ చక్రం తరువాత, వీటిలో కొన్ని దేశాలలో అధికారంలో ఉన్న ప్రగతిశీల పార్టీలు కొత్త ఎన్నికల విజయాల ద్వారా అధికారంలో కొనసాగగలిగాయి. కానీ, కొద్ది కొద్దిగా, కుడి పక్షం తిరిగి సమూహంగా ఏర్పడటం నేర్చుకుంది. పెరుగుతున్న అభద్రత, అవినీతి, స్వేచ్ఛ లేకపోవడానికి ప్రగతి శీలత, వామపక్షం, “ప్రభుత్వ జోక్యం” (statism) కారణమని ఆరోపించే కథనాన్ని పునరుజ్జీవింప జేసింది. ఆర్థిక నియంత్రణ చట్టాలు ఇంతకు ముందు సమాజం నుండి వీటిని తొలగించాయని వారు పేర్కొంటున్నారు.

 

ఈ మార్పు తక్షణమే జరగలేదు. కొన్ని దేశాలలో కుడి పక్షం గెలిచింది, ఆ తర్వాత ప్రగతి శీలత తిరిగి వచ్చింది (బొల్సోనారో తీవ్రవాద కుడిపక్ష పాలన తర్వాత లూలా విషయంలో జరిగినట్లుగా). మరికొన్ని చోట్ల ప్రగతి శీలురు సాధించిన విజయాలు త్వరలోనే ముగిశాయి (పెరూలో కాస్టిల్లో విషయంలో జరిగి నట్లుగా), లేదా కొలంబియాలో పెట్రో యొక్క ‘హిస్టారిక్ ప్యాక్ట్’ విషయంలో జరిగినట్లు ఒకే విడత పదవీకాలం తర్వాత మళ్లీ ఎన్నికల్లో గెలవలేక పోయారు.

 

ఏది ఏమైనప్పటికీ, ప్రస్తుతం దక్షిణ అమెరికాలో, దాదాపు మొత్తం రాజకీయ మ్యాప్ కుడి పక్షం తీవ్ర కుడి పక్ష రంగులతో నిండిపోయింది. పెరూలో ఫుజిమోరి, చిలీలో కాస్ట్, బొలీవియాలో పాజ్, అర్జెంటీనాలో మిలే, ఈక్వడార్‌లో నోబోవా, పరాగ్వేలో పెన్యా, త్వరలో కొలంబియాలో డి లా ఎస్ప్రియెల్లా. ఈ నాయకులందరూ వాషింగ్టన్ యొక్క భౌగోళిక వ్యూహం, లాటిన్ అమెరికా కోసం దాని నయా ఉదారవాద రాజకీయ అజెండాతో ముడిపడి ఉన్న సైద్ధాంతిక, రాజకీయ కూటమిలో భాగమే. జనవరి 3 నాటి దాడి తర్వాత వెనిజులా యునైటెడ్ స్టేట్స్ ప్రభావానికి గురైంది. కేవలం ఉరుగ్వే, బ్రెజిల్ మాత్రమే ప్రగతిశీల పక్షంలో మిగిలి ఉన్నాయి. అది కూడా అక్టోబర్ 4న జరిగే బ్రెజిల్ రాబోయే ఎన్నికల ఆధారంగా మారవచ్చు.రాజకీయ విశ్లేషణ

 

కుడి వైపునకు ఈ మార్పు వెనుక ఉన్న కారణాలను అర్థం చేసుకోవడానికి, ‘న్యూస్ క్లిక్’ ఈక్వెడార్ సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ మిగ్యుయెల్ రూయిజ్‌ తో మాట్లాడింది. దీని వెనుక అనేక అంశాలు పనిచేస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. కుడి పక్షం, తీవ్ర కుడి పక్షాలు విజయాలు సాధించినప్పటికీ, అవి పెద్ద ఆధిక్యతలతో వచ్చినవి కావని (కొన్ని సందర్భాల్లో చాలా స్వల్ప తేడాతో గెలిచాయని), రాజకీయ శక్తుల మధ్య పోటీ ఇంకా ముగిసిపోలేదని ఆయన స్పష్టం చేశారు.

 

ఎన్నికల ఫలితాలపై యునైటెడ్ స్టేట్స్ ప్రత్యక్ష ప్రభావాన్ని కూడా ఆయన ఎత్తి చూపారు “ఈ విజయాలలో సింహభాగం అమెరికా ప్రభుత్వం, ఆ అభ్యర్థులకు అనుకూలంగా పనిచేస్తున్న అమెరికాలోని అత్యంత కుడి పక్ష శక్తిమంతుల బహిరంగ మద్దతు వల్ల వచ్చినవే అని చెప్పడంలో సందేహం లేదు. తాము మద్దతు ఇస్తున్న అభ్యర్థులు గెలవకపోతే ప్రజలకు మద్దతును వెనక్కి తీసుకుంటామని లేదా కనీసం లాటిన్ అమెరికా బలహీనమైన ఆర్థిక వ్యవస్థలకు ఇచ్చే మద్దతును ఉపసంహరించుకుంటామని హెచ్చరిస్తూ ట్రంప్ స్వయంగా లాటిన్ అమెరికన్ పౌరులను బెదిరించడం, భయపెట్టడం బహిరంగంగా బ్లాక్‌ మెయిల్ చేయడం వంటివి చూశాం. ఆ మాటల్లో ఎంత ప్రజాకర్షణ (demagoguery) ఉన్నప్పటికీ, లాటిన్ అమెరికా జనాభాలోని ఒక వర్గంలో ఈ భయం బలంగా నాటుకు పోయినట్లు కనిపిస్తోంది.”

 

ఇజ్రాయెల్ పోషిస్తున్న కీలక పాత్రను కూడా ఆయన నొక్కి చెప్పారు. “యునైటెడ్ స్టేట్స్ మాత్రమే కాదు, ఇజ్రాయెల్ కూడా నకిలీ వార్తలు, తమ వద్ద ఉన్న సాంకేతిక, ప్రచార వనరులను ఉపయోగించి కొందరు అభ్యర్థులకు బహిరంగంగా మద్దతు ఇవ్వడం ద్వారా ఈ ప్రాంతంలో ఒక రాజకీయ శక్తిగా ప్రవేశించింది. అంటే, మీడియా మద్దతుతో అబద్ధాలు, నకిలీ వార్తలు, మానిప్యులేషన్‌తో నిండిన ప్రచారాల ఫలితంగా ఈ విజయాలు వచ్చాయి. అంతేకాకుండా, చెప్పుకోదగ్గ ప్రభావం ఉన్న దేశాలలో ఈ అభ్యర్థులకు బహిరంగంగా మద్దతు ఇచ్చిన కొన్ని ‘నియో-పెంటెకోస్టల్’ చర్చిల మద్దతు వంటి ఇతర లోతైన అంశాలు బయటకు కనపడకుండా బలంగా పనిచేస్తున్నాయి.”వార్తా యాప్

 

ఎన్నికలలో అధికార సామాజిక వర్గాలు పోషించిన ముఖ్యమైన పాత్రను కూడా రూయిజ్ హైలైట్ చేశారు. “ఈ [కుడిపక్ష] అభ్యర్థులలో చాలామందికి స్థానిక అగ్రవర్ణాల (oligarchies) మద్దతు ఉంది. చిలీ విషయంలో లాగా వారిలో కొందరు నేరుగా ఆ అగ్రవర్ణాలకే చెంది ఉన్నారు లేదా కనీసం వారు జాతీయంగానే కాకుండా అంతర్జాతీయంగా కూడా అగ్రవర్ణ రంగాలతో పొత్తులు పెట్టుకున్నారు.”

 

చివరగా, అనేక ప్రగతిశీల పార్టీల ఆకర్షణ కొంతవరకు తగ్గిందని ఆయన గమనించారు. “ఈ విజయాలు కేవలం మానిప్యులేషన్, భయం, డబ్బు వల్ల మాత్రమే కాకుండా, ఒకప్పుడు ప్రగతిశీల లేదా వామపక్ష ప్రభుత్వాలకు ఓటు వేసిన ప్రజలు ఈరోజు అలా వేయకపోవడం వల్ల కూడా సంభవించాయని ముఖ్యంగా భావిస్తున్నాను. గడిచిన ప్రభుత్వాల పట్ల కలిగిన కొంత నిరాశతో కూడా ఇది ముడిపడి ఉండవచ్చు. మరో మాటలో చెప్పాలంటే, ప్రగతిశీల ప్రభుత్వాలు ప్రజల భావాలను గుర్తించడం లో బహుశా విఫల మయ్యాయి.”రాజకీయ విశ్లేషణ

 

నూతన లేదా పాత కుడి పక్ష ఉద్యమాలా?

 

కొత్త ప్రభుత్వాల ఏర్పాటులో పాత కుడి పక్ష పార్టీల ప్రాముఖ్యతను మనం విస్మరించకూడదని ప్రొఫెసర్ రూయిజ్ నొక్కి చెప్పారు. అందువల్ల, “నూతన కుడి పక్షం” అని పిలువబడేది నిజానికి పాత కుడి పక్షానికి ఒక కొనసాగింపు కాదా అని మనం ప్రశ్నించుకోవాలని ఆయన అన్నారు. “కొత్త రాజకీయ నాయకులు ఉన్నప్పటికీ, బహుశా కొత్త మాటలు, కొత్త రూపాలతో వచ్చినప్పటికీ, పాత కుడి పక్ష ఉద్యమాలతో ఏమాత్రం సంబంధం లేని కొత్త కుడి పక్షం గురించి మనం మాట్లాడలేమని నేను భావిస్తున్నాను. అయితే, తమను తాము పునర్నిర్మించుకుంటున్న పాత కుడి పక్ష శక్తుల నుండి ఈ కొత్త నాయకులు రకరకాల మద్దతును పొందారనే విషయాన్ని మనం విస్మరించకూడదు. ఉదాహరణకు చిలీ వంటి కొన్ని సందర్భాల్లో, ఈ కుడి పక్ష గ్రూపుల సభ్యులు మళ్లీ కొత్త పార్టీల కింద పోటీ చేస్తున్నారు. అయితే దీని అర్థం వారు ఇప్పటికే పాత కుడి పక్ష ఉద్యమాల్లోనూ, పాత అగ్రవర్ణాల్లోనూ భాగస్వాములు కారని కాదు.”

 

అయినప్పటికీ, నూతన కుడి పక్ష రాజకీయ నాయకులలో కొత్తగా కనిపిస్తున్న కొన్ని భావజాల ధోరణులను ఆయన గుర్తుచేశారు. “పాత కుడి పక్ష భాష నుండి వీరిని వేరుచేసే అత్యంత కొత్త అంశం ఏంటంటే వీరు తమ మాటల్లో మరింత బహిరంగంగా తీవ్రవాదాన్ని, హింసను ప్రదర్శిస్తున్నారు. విదేశీయులపై ద్వేషం (xenophobia) వారి మాటల్లో చోటుచేసుకుంటోందని, వారు లింగ సమానత్వాన్ని (gender equality) తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని, ఆ విధంగా మాటల పరంగా ఆధిపత్యం సాధిస్తున్నారని నేను నమ్ముతున్నాను.”

 

యునైటెడ్ స్టేట్స్, నూతన లాటిన్ అమెరికన్ కుడిపక్షం:

 

కొత్త ప్రభుత్వాలు, ట్రంప్ పరిపాలన మధ్య సంబంధాల గురించి సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ మాట్లాడుతూ “మనం చూస్తున్నది యునైటెడ్ స్టేట్స్, ప్రత్యేకించి అధ్యక్షుడు ట్రంప్ నుండి వారి అభ్యర్థులకు లభిస్తున్న మద్దతు మాత్రమే కాదు. వారు ట్రంప్‌తో ప్రపంచ దృక్పథాన్ని, రాజకీయ ఆలోచనను, అధికారాన్ని ఎలా ఉపయోగించాలనే విషయాలను కూడా పంచుకుంటున్నారు. నేను కేవలం వారి నియంతృత్వ ధోరణుల గురించే మాట్లాడటం లేదు. నూతన కుడి పక్షానికి చెందిన ఈ రంగాలు, ట్రంపిజానికి (ముఖ్యంగా పైస్థాయి నుండి) మద్దతు ఇచ్చిన పెట్టుబడిదారీ గ్రూపులు, శక్తిమంతులతో మరింత ఎక్కువగా ఏర్పరుచు కుంటున్న సంబంధాల గురించి కూడా మాట్లాడుతున్నాను.”రాజకీయ విశ్లేషణ

 

“నేను చెప్పేది కింది స్థాయి ట్రంపిజం , ట్రంప్‌కు మద్దతు ఇచ్చే అమెరికన్ కార్మిక వర్గ ట్రంపిజం గురించి కాదు. ట్రంప్ విధానాల ద్వారా లబ్ధి పొందిన అగ్రవర్ణ గ్రూపులు, ముఖ్యంగా టెక్ అగ్ర వర్గాలు (tech oligarchy), ఇతర పెట్టుబడిదారీ వర్గాల గురించి. ‘పలాంటిర్’ (Palantir) పీటర్ థీల్ (Peter Thiel) విషయంలో లాగా, వివిధ రకాల నిధులు, మీడియా మద్దతు, వ్యూహాత్మక ఒప్పందాల ద్వారా వీరే పనిచేస్తున్నారని మనం చూస్తున్నాము. ఈ అధికార స్థానాల నుండి, వారు యునైటెడ్ స్టేట్స్‌లో ట్రంపిజానికి, ఉదాహరణకు ఇటలీ లోని మిలే (Milei) ప్రభుత్వం వంటి వాటికి ఒకే సమయంలో మద్దతు ఇస్తున్నారు,” అని రూయిజ్ అన్నారు.

 

ప్రస్తుత కుడి పక్ష ప్రభుత్వాలకు, టెల్ అవీవ్ (ఇజ్రాయెల్) కి మధ్య ఉన్న స్పష్టమైన సంబంధాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. “దీంతో పోలీకగా ఉండే మరొక విషయం నేను ఇప్పటికే కొంతవరకు చెప్పిన విషయానికే చెందుతుంది. హోండురాస్ లేదా కొలంబియా వంటి సందర్భాలలో ప్రాంతీయ జోక్యానికి ఇజ్రాయెల్ ప్రభుత్వానికి, ముఖ్యంగా ప్రధాని నెతన్యాహుకు, అత్యంత ప్రముఖమైన పాత్ర ఇవ్వబడుతున్నది. బ్రెజిల్‌లో బొల్సోనారో కుమారుడు ఫ్లావియో బొల్సోనారో అభ్యర్థిత్వం విషయంలో లాగే, లాటిన్ అమెరికన్ ఎన్నికల ప్రక్రియలపై ఇజ్రాయెల్ ప్రభుత్వం మరింత ప్రభావం చూపడానికి తలుపులు బార్లా తెరవ బడ్డాయి. అక్కడ కూడా ట్రంపిజం తో ఒక సమన్వయం ఉంది.

More articles

Latest article

App Icon

Install DT News App

Add to home screen for faster loading and latest updates.