26.5 C
Hyderabad
Monday, September 14, 2026

పట్టా భూములు తీసుకుని.. రికార్డుల్లేని భూములు చూపించారు సమాన విలువైన భూములు ఇస్తామని నమ్మించి మోసం చేశారని రైతుల ఆరోపణ పదేళ్లుగా పట్టాలు కాక లబోదిబోమంటున్న బాధితులు

Must read

📰 Generate e-Paper Clip

పట్టా భూములు తీసుకుని.. రికార్డుల్లేని భూములు చూపించారు

సమాన విలువైన భూములు ఇస్తామని నమ్మించి మోసం చేశారని రైతుల ఆరోపణ

పదేళ్లుగా పట్టాలు కాక లబోదిబోమంటున్న బాధితులు

చేపల చెరువుల నిర్వహణలోనూ నిబంధనలు పాటించడం లేదని స్థానికుల ఆరోపణలు

ఖమ్మం ప్రతినిధి , ఆగస్టు 21(దేశ టైమ్స్ )

 

సమాన విలువైన మరో భూమిని ఇస్తామని నమ్మించి ఇద్దరు రైతుల నుంచి పట్టా భూములను తీసుకుని, అందుకు బదులుగా రికార్డులు లేని భూములను చూపించారని చేపల చెరువు కాంట్రాక్టర్‌పై బాధితులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటన మండల పరిధిలోని కలకోటలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

 

బాధితుల కథనం ప్రకారం.. ఆంధ్ర ప్రాంతానికి చెందిన చేపల చెరువుల వ్యాపారి రాముడు, ఆయన మామ మాధవరావు కలకోటలో చేపల పెంపకం కోసం భూములు కొనుగోలు చేస్తున్న సమయంలో గుండ్ల పాండు, గుండ్ల కోటయ్యలకు చెందిన పట్టా భూములను కూడా ఇవ్వాలని కోరారు. అయితే తమ జీవనాధారమైన భూములను విక్రయించేందుకు రైతులు నిరాకరించారు.

 

ఈ క్రమంలో తమ భూములకు సమాన విలువైన భూములను మరోచోట ఇస్తామని నమ్మించడంతో పాండుకు చెందిన 1.25 ఎకరాలు, కోటయ్యకు చెందిన ఎకరం పట్టా భూములను తీసుకున్నారని బాధితులు ఆరోపించారు. అందుకు బదులుగా ఎలాంటి రికార్డులు లేని భూములను చూపించి, వాటిని తమ పేర్లపై పట్టాలో నమోదు చేయిస్తామని హామీ ఇచ్చినట్లు తెలిపారు.

 

పదేళ్లు గడిచినా..

 

పదేళ్లు గడిచినా ఆ భూములు తమ పేర్లపై రికార్డుల్లో నమోదు కాలేదని బాధితులు వాపోతున్నారు. భూములు ఇచ్చిన రైతులు మృతి చెందడంతో వారి వారసులు తమకు ఇవ్వాల్సిన భూములను రిజిస్ట్రేషన్ చేయాలని వ్యాపారిని కోరినట్లు తెలిపారు. అయితే ఈ విషయంలో తాను ఏమీ చేయలేనని చెప్పడంతో తాము మోసపోయినట్లు గుర్తించామని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

 

రికార్డులు లేని భూముల కారణంగా ప్రభుత్వ పథకాలకు అర్హత కోల్పోతున్నామని వారు పేర్కొన్నారు. తమ పట్టా భూములను తిరిగి ఇప్పించడంతో పాటు, తమకు న్యాయం చేసి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బాధితులు అధికారులను కోరుతున్నారు.

 

నిబంధనలు పాటించడం లేదని ఆరోపణలు

 

ఇదిలా ఉండగా.. సదరు చేపల చెరువుల నిర్వహణలోనూ నిబంధనలు పాటించడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. అవసరమైన అనుమతులు లేకుండానే చెరువులు నిర్వహించడంతో పాటు, భారీ విద్యుత్ మోటార్లను ఏర్పాటు చేసి వైరా నది నీటిని వినియోగిస్తున్నారని చెబుతున్నారు.

 

అంతేకాక చెరువుల్లోని వ్యర్థాలను దిగువన ఉన్న చెరువుల్లోకి వదులుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ వ్యవహారంపై సంబంధిత శాఖల అధికారులు సమగ్రంగా విచారణ జరిపి, ఆరోపణలు నిజమని తేలితే బాధ్యులపై చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.

More articles

Latest article

App Icon

Install DT News App

Add to home screen for faster loading and latest updates.