26.5 C
Hyderabad
Monday, September 14, 2026

తెలంగాణ విద్యుత్ రంగంలో జరుగుతున్న విప్లవాత్మక మార్పులను ప్రజలకు చేరవేసేందుకే పవర్ ఎగ్జిబిషన్ – టీజీఎస్పీడీసీఎల్ సీఎండీ జితేష్ వి. పాటిల్, ఐఏఎస్

Must read

📰 Generate e-Paper Clip

 

 

తెలంగాణ విద్యుత్ రంగంలో జరుగుతున్న విప్లవాత్మక మార్పులను ప్రజలకు చేరవేసేందుకే పవర్ ఎగ్జిబిషన్ – టీజీఎస్పీడీసీఎల్ సీఎండీ జితేష్ వి. పాటిల్, ఐఏఎస్

 

హైదరాబాద్, ఆగస్టు 20, 2026:

 

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ అనుముల రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి మరియు ఆర్థిక, ప్రణాళిక, ఇంధన శాఖ మంత్రి శ్రీ మల్లు భట్టి విక్రమార్క గారు, ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీ నవీన్ మిట్టల్ గారి మార్గదర్శకత్వంలో రాష్ట్ర విద్యుత్ రంగంలో జరుగుతున్న సాంకేతిక, పరిపాలనా మరియు వినియోగదారుల సేవల విప్లవాత్మక మార్పులను ప్రజలకు ప్రత్యక్షంగా పరిచయం చేయడమే “TGSPDCL Power Exhibition–2026” ప్రధాన ఉద్దేశమని టీజీఎస్పీడీసీఎల్ సీఎండీ శ్రీ జితేష్ వి. పాటిల్, ఐఏఎస్ తెలిపారు.

 

ఈ నెల 22, 23, 24 తేదీలలో హైదరాబాద్ నెక్లెస్ రోడ్‌లోని పీపుల్స్ ప్లాజాలో నిర్వహించనున్న మూడు రోజుల పవర్ ఎగ్జిబిషన్‌లో తెలంగాణ విద్యుత్ రంగం గత దశాబ్దంలో సాధించిన ప్రగతి, ప్రస్తుతం అమలు చేస్తున్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాలు, భవిష్యత్ ప్రణాళికలను ప్రజలకు అందుబాటులో ఉంచనున్నట్లు తెలిపారు.

 

ప్రస్తుతం విద్యుత్ పంపిణీ వ్యవస్థను మరింత స్మార్ట్, విశ్వసనీయ, ప్రతిస్పందనాత్మకంగా తీర్చిదిద్దేందుకు సంస్థ చేపడుతున్న SCADA విస్తరణ, FLISR వ్యవస్థ, స్మార్ట్ మీటరింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత సేవలు, డిజిటల్ నెట్‌వర్క్ మ్యాపింగ్, వినియోగదారుల సేవల ఆధునీకరణ వంటి అంశాలను ఎగ్జిబిషన్‌లో ప్రదర్శించనున్నట్లు వెల్లడించారు.

 

విద్యుత్ సరఫరాలో ఎక్కడైనా అంతరాయం ఏర్పడితే వెంటనే గుర్తించి స్పందించేందుకు రూపొందించిన ఆధునిక వ్యవస్థలు, పవర్ అంబులెన్స్ సేవలు, ఫాల్ట్ మేనేజ్‌మెంట్ సిస్టమ్స్, రియల్ టైమ్ మానిటరింగ్ విధానాలు ప్రజలకు ప్రత్యక్షంగా చూపించనున్నట్లు చెప్పారు.

 

రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన నెట్‌వర్క్ మ్యాపింగ్ కార్యక్రమం ద్వారా ఏ ఫీడర్‌పై ఏ ట్రాన్స్‌ఫార్మర్ ఉందో, ఆ ట్రాన్స్‌ఫార్మర్ పరిధిలో ఏయే వినియోగదారులు ఉన్నారో ఖచ్చితంగా గుర్తించే సాంకేతిక వ్యవస్థను అభివృద్ధి చేశామని తెలిపారు. దీనివల్ల ఫిర్యాదుల పరిష్కార సమయం గణనీయంగా తగ్గడంతో పాటు సేవల నాణ్యత మరింత మెరుగుపడిందన్నారు.

 

విద్యుత్ అంతరాయాలను కేవలం పరిష్కరించడమే కాకుండా ముందుగానే గుర్తించి నివారించే ప్రివెంటివ్ మెయింటెనెన్స్ విధానాలను సంస్థ అమలు చేస్తోందని తెలిపారు. ప్రతి వారం విద్యుత్ అంతరాయాలపై విశ్లేషణ నిర్వహించి, భవిష్యత్తులో సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపడుతున్నామని వివరించారు.

 

ఎగ్జిబిషన్‌లో 132 కేవీ సబ్‌స్టేషన్ మోడళ్లు, ట్రాన్స్‌ఫార్మర్ల నిర్మాణం, విద్యుత్ ఉత్పత్తి–ప్రసారం–పంపిణీ విధానం, గృహ వైరింగ్ భద్రత, విద్యుత్ ప్రమాదాల నివారణ, సోలార్ విద్యుత్, బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్స్ (BESS), ఎలక్ట్రిక్ వాహనాల చార్జింగ్ సాంకేతికతలు వంటి అంశాలను ప్రత్యక్ష నమూనాలతో ప్రదర్శించనున్నట్లు తెలిపారు.

 

ముఖ్యంగా విద్యార్థులు, యువత విద్యుత్ రంగంలోని సాంకేతిక అంశాలను సులభంగా అర్థం చేసుకునేలా వర్కింగ్ మోడల్స్, ఇంటరాక్టివ్ డిస్ప్లేలు, సైన్స్ ఆధారిత ప్రదర్శనలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఈ ప్రదర్శనలు భవిష్యత్‌లో విద్యుత్, ఇంధన రంగాలపై ఆసక్తి పెంచేందుకు దోహదపడతాయని పేర్కొన్నారు.

 

అదేవిధంగా వినియోగదారులు విద్యుత్ సేవలపై ఉన్న సందేహాలను నేరుగా అధికారులను అడిగి తెలుసుకునే ప్రత్యేక కన్స్యూమర్ సర్వీస్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ప్రతి స్టాల్‌లో సంస్థ అధికారులు ప్రజలకు పూర్తి వివరాలు అందిస్తారని తెలిపారు.

 

ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఆధునిక లేజర్ షోలు, డిజిటల్ ప్రజెంటేషన్లు, సేఫ్టీ డెమోన్స్ట్రేషన్లు, సాంకేతిక ప్రదర్శనలు కూడా నిర్వహించనున్నట్లు తెలిపారు.

 

ఈ పవర్ ఎగ్జిబిషన్‌ను ఎలాంటి బాహ్య సంస్థల సహకారం లేకుండా పూర్తిగా టీజీఎస్పీడీసీఎల్ అధికారులు, సిబ్బంది స్వయంగా రూపకల్పన చేసి నిర్వహిస్తున్నారని సీఎండీ తెలిపారు. విద్యుత్ రంగంలో తెలంగాణ సాధించిన పురోగతిని ప్రజలకు చేరవేసి, వినియోగదారులు మరియు విద్యుత్ సంస్థల మధ్య మరింత అనుబంధాన్ని పెంపొందించడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమన్నారు.

 

హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల ప్రజలు, విద్యార్థులు, ఇంజినీరింగ్ విద్యార్థులు, పరిశోధకులు, కుటుంబ సభ్యులు ఈ ఎగ్జిబిషన్‌ను సందర్శించి విద్యుత్ రంగంలోని ఆధునిక పరిణామాలను తెలుసుకోవాలని సీఎండీ శ్రీ జితేష్ వి. పాటిల్ ఆహ్వానించారు.

More articles

Latest article

App Icon

Install DT News App

Add to home screen for faster loading and latest updates.