23.5 C
Hyderabad
Sunday, October 25, 2026

యువతలో హెచ్ఐవి, ఎయిడ్స్‌పై విస్తృత అవగాహన కల్పించాలి

Must read

📰 Generate e-Paper Clip

 

యువతలో హెచ్ఐవి, ఎయిడ్స్‌పై విస్తృత అవగాహన కల్పించాల

హెచ్ఐవి రహిత జిల్లాగా ఖమ్మంను తీర్చిదిద్దాలి: కలెక్టర్ దివాకర టీఎస్

ఎస్ఆర్‌&బీజీఎన్‌ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల వద్ద అవగాహన బైక్ ర్యాలీ ప్రారంభం

ఖమ్మం ప్రతినిధి, సెప్టెంబర్ 18 (దేశ టైమ్స్): ఖమ్మం జిల్లాను హెచ్ఐవి, ఎయిడ్స్ రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్ అన్నారు.

తెలంగాణ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం ఖమ్మంలోని ఎస్ఆర్‌&బీజీఎన్‌ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల వద్ద నిర్వహించిన ఎయిడ్స్ అవగాహన బైక్ ర్యాలీని కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. కళాశాల నుంచి ప్రారంభమైన ర్యాలీ పాత బస్టాండ్ వరకు కొనసాగింది.

ర్యాలీలో విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, లింక్ వర్కర్లు తదితరులు పాల్గొని హెచ్ఐవి, ఎయిడ్స్ నివారణ, నియంత్రణ, ఆరోగ్య పరిరక్షణకు సంబంధించిన సందేశాలతో కూడిన ప్లకార్డులను ప్రదర్శిస్తూ ప్రజలకు అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ దివాకర టీఎస్ మాట్లాడుతూ హెచ్ఐవి వ్యాప్తిని అరికట్టడంలో ముందస్తు అవగాహన, జాగ్రత్తలు, బాధ్యతాయుతమైన ఆరోగ్య అలవాట్లు కీలకమని అన్నారు. ముఖ్యంగా యువతలో ఎయిడ్స్‌పై శాస్త్రీయమైన అవగాహన పెంపొందించాల్సిన అవసరం ఉందని తెలిపారు. హెచ్ఐవితో జీవిస్తున్న వ్యక్తుల పట్ల వివక్ష చూపకుండా, వారికి సామాజిక మద్దతు అందించేలా ప్రజల్లో చైతన్యం కల్పించాలని సూచించారు.

జిల్లావ్యాప్తంగా హెచ్ఐవి నివారణ, నియంత్రణ కార్యక్రమాలను మరింత విస్తృతంగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా యువత, విద్యార్థులు, అధిక ప్రమాదానికి లోనయ్యే వర్గాల్లో నిరంతరం అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. హెచ్ఐవి ఎలా వ్యాప్తి చెందుతుంది, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వ్యాధి నిర్ధారణ, చికిత్స, అందుబాటులో ఉన్న ప్రభుత్వ ఆరోగ్య సేవలపై ప్రజలకు సరైన సమాచారాన్ని చేరవేయాలని తెలిపారు.

జానపద కళాబృందం ఆధ్వర్యంలో నిర్వహించిన కళాజాతా, ‘పల్లె సుద్దులు’ వంటి సంప్రదాయ కళారూపాల ద్వారా ఎయిడ్స్ వ్యాప్తి, నివారణ, చికిత్స, వివక్ష నిర్మూలనపై యువత, ప్రజలకు అవగాహన కల్పించారు.

ఈ కార్యక్రమంలో డీఎంహెచ్‌ఓ డా. రామారావు, డిప్యూటీ డీఎంహెచ్‌ఓ డా. వేణు మాధవ్, అదనపు డీఎంహెచ్‌ఓ (ఎయిడ్స్ & లెప్రసీ) డా. ఎల్. ప్రవీణ, ఎస్ఆర్‌&బీజీఎన్‌ఆర్ ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపాల్ మహమ్మద్ జాకీరుల్లా, ఆర్ఆర్‌సీ కోఆర్డినేటర్ డా. బి. చెంచు రత్నయ్య, ఐక్యూఎసీ కోఆర్డినేటర్ డా. ఎం. సునంద, జిల్లా ఎయిడ్స్ నివారణ నియంత్రణ విభాగం అధికారులు, సిబ్బంది, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, లింక్ వర్కర్లు, కళాశాల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article

App Icon

Install DT News App

Add to home screen for faster loading and latest updates.