జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం అయిలాపూర్‌లో దారుణ ఘటన చోటుచేసుకున్నట్లు సమాచారం. వివాహేతర సంబంధం పెట్టుకుందనే ఆరోపణలతో ఓ మహిళపై గ్రామంలోని కొందరు కులపెద్దలు పంచాయితీ పేరుతో అమానుషంగా ప్రవర్తించినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి.
అయిలాపూర్ గ్రామ పొలిమేరల్లో పంచాయితీ నిర్వహించిన సమయంలో మహిళను వివస్త్రను చేసి దాడి చేసినట్లు సమాచారం. అంతటితో ఆగకుండా ఆమె శరీరంపై కారం, జీడిరసం పూసినట్లు ఆరోపణలు ఉన్నాయి.
తీవ్రంగా బాధపడుతూ మహిళ కేకలు వేసినప్పటికీ ఆమెను వదిలిపెట్టకుండా దాడికి పాల్పడినట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ ఘటనలో కొందరు మహిళలు కూడా పాల్గొన్నట్లు సమాచారం.
ఈ అమానుష ఘటనపై పోలీసులు వెంటనే స్పందించి, బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఘటనపై పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేసి, పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాలని కోరుతున్నారు.
ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు, బాధ్యులపై తీసుకున్న చర్యలపై అధికారిక సమాచారం వెలువడాల్సి ఉంది.

