హ్యూస్టన్, అక్టోబర్ 4: అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రం హ్యూస్టన్‌లో తీవ్ర విషాద ఘటన చోటుచేసుకుంది. నాలుగేళ్ల చిన్నారి కస్టడీకి సంబంధించిన కోర్టు తీర్పు వెలువడిన కొద్దిసేపటికే ఆమె తల్లి దారుణానికి పాల్పడింది. తన నాలుగేళ్ల కుమార్తె వివియన్ సెవెల్లాను తుపాకీతో కాల్చి చంపిన అనంతరం తానూ కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన సెప్టెంబర్ 29న వెస్ట్ హ్యూస్టన్‌లోని టెర్రా రిజర్వ్ ప్రాంతంలో జరిగింది.
కుటుంబ న్యాయస్థానంలో జరిగిన విచారణలో చిన్నారి తండ్రి ఆరోన్ సెవెల్లాకు ప్రాథమిక సంరక్షణ హక్కులు అప్పగించినట్లు కోర్టు పత్రాలను ఉటంకిస్తూ స్థానిక మీడియా వెల్లడించింది. తల్లికి కుమార్తెను కలిసే అవకాశం ఉన్నప్పటికీ, ఆ సమావేశాలు నిరంతర పర్యవేక్షణలోనే జరగాలని కోర్టు ఆదేశించినట్లు సమాచారం. అదే రోజు సాయంత్రం చిన్నారిని తండ్రి వద్దకు తీసుకెళ్లాల్సి ఉండగా ఈ విషాదం చోటుచేసుకుంది.
కాల్పుల సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకునే సరికి చిన్నారి తీవ్ర గాయాలతో మృతి చెంది ఉంది. తల్లి కూడా తుపాకీ గాయాలతో కనిపించడంతో ఆమెను ఆస్పత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ మరుసటి రోజు ఆమె మృతి చెందినట్లు హ్యూస్టన్ పోలీసులు తెలిపారు.
ఘటన జరిగిన సమయంలో ఇంట్లో చిన్నారి సవతి తండ్రి, సంరక్షకురాలు కూడా ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలపై దర్యాప్తు కొనసాగుతోంది.
కుటుంబ కలహాలు, దాంపత్య విభేదాలు, కస్టడీ వివాదాలు వంటి సున్నితమైన పరిస్థితుల్లో క్షణిక ఆవేశానికి లోనుకాకుండా కుటుంబ సభ్యులు, నమ్మకమైన వ్యక్తులు లేదా న్యాయ నిపుణుల సహాయం తీసుకోవడం ఎంతో ముఖ్యం. సమస్య ఎంత తీవ్రమైనదైనా ప్రాణాలకు హాని కలిగించే నిర్ణయాలు పరిష్కారం కావు.