DESHA TIMES
Newspaper Banner
Date of Publish : 03 October 2026, 5:08 am Posted by : DESHA TIME

ఆటోడ్రైవర్ పైశాచికం.. ఒంటరిగా ఎక్కిన మహిళను గోదావరి ఒడ్డుకు తీసుకెళ్లి దారుణం

తూర్పుగోదావరి: విధులు ముగించుకుని ఇంటికి వెళ్తున్న ఓ మహిళను ఆటోడ్రైవర్ బంగారు ఆభరణాల కోసం గోదావరి ఒడ్డుకు తీసుకెళ్లి దారుణానికి పాల్పడిన ఘటన తాళ్లపూడి ప్రాంతంలో వెలుగులోకి వచ్చింది.

పోలీసుల వివరాల ప్రకారం.. ఏలూరు జిల్లా పోలవరం మండలం కొత్తపట్టిసీమకు చెందిన ఆదిలక్ష్మి (36) భర్త ఏడేళ్ల క్రితం అనారోగ్యంతో మృతి చెందారు. అనంతరం పుట్టింటివారి వద్ద ఉంటూ తాళ్లపూడిలోని ఓ మిఠాయి దుకాణంలో పనిచేస్తున్నారు. సోమవారం రాత్రి విధులు ముగించుకుని ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు.

సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించిన పోలీసులు.. ఆదిలక్ష్మి తాడిపూడికి చెందిన ఆటోడ్రైవర్ షేక్ యాకబ్ ఆటోలో ఒంటరిగా వెళ్లినట్లు గుర్తించారు. ఇతర ప్రయాణికులు లేరని గమనించిన యాకబ్ ఆమెను తాడిపూడి ఏటిగట్టు కింద ఉన్న శ్మశానం దారి వైపు తీసుకెళ్లినట్లు పోలీసులు తెలిపారు.

అక్కడ ఆమె వద్ద ఉన్న సుమారు 3 కాసుల బంగారు ఆభరణాలను లాక్కుని, ఆమె ప్రతిఘటించడంతో గోదావరిలోకి తోసివేసినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైనట్లు సమాచారం.

నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా ఘటనకు సంబంధించిన వివరాలు వెలుగులోకి వచ్చినట్లు తెలిపారు. అతడి వాంగ్మూలం ఆధారంగా గోదావరిలో ఆదిలక్ష్మి ఆచూకీ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి