మరిపెడ పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన డీఐజీ స్వేతా ఐపీఎస
రికార్డుల నిర్వహణపై ప్రతి పోలీసు సిబ్బందికి పూర్తి అవగాహన ఉండాలి గస్తీ విధుల్లో అప్రమత్తత, ప్రజా భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలి
దేశ టైమ్స్
మరిపెడఅక్టోబర్ 23
వరంగల్ పోలీస్ కమిషనర్, భద్రాద్రి జోన్-IV డీఐజీ స్వేతా ఐపీఎస్ మరిపెడ పోలీస్ స్టేషన్‌ను సందర్శించి సమగ్రంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మహబూబాబాద్ జిల్లా ఎస్పీ డాక్టర్ శబరీష్ ఐపీఎస్ పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు. పోలీస్ సిబ్బంది గౌరవ వందనం సమర్పించారు.
అనంతరం జిల్లా ఎస్పీతో కలిసి పోలీస్ స్టేషన్‌లోని కిట్ ఆర్టికల్స్, యూనిఫాంలు, షూస్, లాఠీలు తదితర సామగ్రిని పరిశీలించారు. స్టేషన్ పరిసరాలు, గదులు, ఫైళ్ల నిర్వహణ, రికార్డుల అమరికతో పాటు పరిశుభ్రత, క్రమబద్ధతకు సంబంధించిన 5S విధానం అమలును సమీక్షించారు.
పోలీస్ స్టేషన్‌లో నిర్వహిస్తున్న క్రైమ్ రికార్డులు, అనుమానితుల షీట్లు, ప్రాపర్టీ రిజిస్టర్, గన్ లైసెన్స్ రిజిస్టర్, డ్యూటీ రోస్టర్, విలేజ్ రోస్టర్, పెట్టీ కేసులు, ప్రాసెస్ రిజిస్టర్లతో పాటు ఇతర రికార్డులను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ప్రతి రికార్డును నిబంధనల ప్రకారం నిర్వహిస్తూ, కేసుల వివరాలను ఎప్పటికప్పుడు నవీకరించాలని సూచించారు. పోలీస్ స్టేషన్‌లోని రికార్డులు, ఫైళ్లు, రిజిస్టర్లపై ప్రతి అధికారి, సిబ్బందికి పూర్తి అవగాహన ఉండాలని స్పష్టం చేశారు.
ఎన్‌డీపీఎస్ కేసుల దర్యాప్తు, పెండింగ్ కేసుల పరిష్కారం, గంజాయి అక్రమ రవాణా నియంత్రణకు తీసుకుంటున్న చర్యలను సమీక్షించారు. సైబర్ నేరాల కేసుల్లో సమర్థవంతమైన దర్యాప్తు చేపట్టి బాధితులకు సత్వర న్యాయం అందించాలని ఆదేశించారు. ఆన్‌లైన్ మోసాలు, నకిలీ పెట్టుబడి పథకాలు, ఓటీపీ మోసాలు, డిజిటల్ అరెస్టుల పేరుతో జరిగే మోసాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని, బాధితులు వెంటనే 1930 హెల్ప్‌లైన్‌ను సంప్రదించేలా చైతన్యపరచాలని సూచించారు.
పోక్సో కేసుల్లో వేగవంతమైన, నిష్పక్షపాత దర్యాప్తు చేపట్టి బాధిత బాలబాలికలకు న్యాయం అందించాలని తెలిపారు. బాధితుల గోప్యతను కాపాడుతూ, వారికి అవసరమైన సహాయ సహకారాలు అందించాలని, బాలలపై నేరాల నివారణకు పాఠశాలలు, గ్రామీణ ప్రాంతాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు.
గస్తీ విధుల్లో అప్రమత్తతతోనే పోలీస్ శాఖపై ప్రజలకు నమ్మకం పెరుగుతుందని డీఐజీ స్వేతా పేర్కొన్నారు. ప్రజల భద్రతకు భరోసా కల్పిస్తూ ప్రతి పోలీసు సిబ్బంది అంకితభావంతో, క్రమశిక్షణతో విధులు నిర్వహించాలని సూచించారు. ప్రజలతో మర్యాదగా వ్యవహరిస్తూ వారి సమస్యలను సత్వరమే పరిష్కరించాలని తెలిపారు.
ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ సిబ్బందితో ముఖాముఖిగా మాట్లాడి వారి విధులు, బాధ్యతలు, సమస్యలు, సంక్షేమ అంశాలపై ఆరా తీశారు. విధుల్లో నిరంతరం నిమగ్నమయ్యే పోలీసులు తమ ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. వ్యక్తిగత క్రమశిక్షణతో పాటు ఆర్థిక క్రమశిక్షణను పాటిస్తూ, ఆదాయానికి అనుగుణంగా ఖర్చులను నియంత్రించుకోవాలని, పొదుపునకు ప్రాధాన్యత ఇవ్వాలని హితవు పలికారు.
ప్రతి ఫిర్యాదుపై తక్షణమే స్పందించి బాధితులకు న్యాయం అందించాలని, మహిళలు, పిల్లలు, వృద్ధుల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు. పారదర్శకత, జవాబుదారీతనంతో విధులు నిర్వహిస్తూ ప్రజలకు నాణ్యమైన పోలీస్ సేవలు అందించాలని, పోలీస్ శాఖపై ప్రజల్లో విశ్వాసాన్ని మరింత బలోపేతం చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.