DESHA TIMES
Newspaper Banner
Date of Publish : 09 October 2026, 4:59 am Posted by : DESHA TIME

విశాఖకు వచ్చి అదృశ్యమైన అస్సాం యువతి.. శ్రీకాకుళంలో అనుమానాస్పద మృతి

 

 

శ్రీకాకుళం (దేశ టైమ్స్): ఆంధ్రప్రదేశ్‌కు వచ్చిన అస్సాంకు చెందిన యువతి హిమశ్రీ బోరో (20) అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. విశాఖపట్నంలో ఓ కార్యక్రమానికి హాజరయ్యేందుకు తన డ్యాన్స్‌ బృందంతో కలిసి వచ్చిన ఆమె, తిరుగు ప్రయాణంలో అదృశ్యమై.. శ్రీకాకుళం జిల్లాలో రైల్వే ట్రాక్‌ పక్కన మృతదేహంగా కనిపించింది.

 

అస్సాంలోని గౌహతికి చెందిన హిమశ్రీ బోరో అక్టోబర్‌ 6న కన్యాకుమారి–దిబ్రూగఢ్‌ వివేక్‌ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణిస్తున్న సమయంలో అదృశ్యమైనట్లు సమాచారం. అదృశ్యం కావడానికి ముందు తెల్లవారుజామున 2:39 గంటలకు తన స్నేహితుడికి ఫోన్‌ చేసి, కొందరు తనను వేధిస్తున్నారని చెప్పినట్లు తెలుస్తోంది. అనంతరం ఆమె ఫోన్‌ స్విచ్‌ ఆఫ్‌ అయింది.

 

ఈ క్రమంలో శ్రీకాకుళం జిల్లాలోని టికులంపాడు సమీపంలో రైల్వే పట్టాల పక్కన ఆమె మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. ఆమెకు సంబంధించిన బ్యాగులు రైలులో లభించినట్లు అధికారులు వెల్లడించారు.

 

ప్రమాదవశాత్తు రైలు నుంచి కిందపడిందా? లేక ఎవరైనా తోసేశారా? అనే కోణాల్లో రైల్వే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. యువతి మృతికి గల అసలు కారణం, ఆమె అదృశ్యానికి దారితీసిన పరిస్థితులు పోలీసుల విచారణలో తేలాల్సి ఉంది.