హైదరాబాద్: మాదాపూర్ సిద్దిఖ్‌నగర్‌లోని ఓయో హోటల్‌లో యువతి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. నిన్న షారన్ నిఖిత, శ్రీనివాస రవితేజ కలిసి హోటల్‌లో దిగినట్లు సమాచారం.
కొంతసేపటి తర్వాత నిఖిత స్పృహ కోల్పోవడంతో రవితేజ, హోటల్ సిబ్బంది ఆమెను కొత్తగూడలోని అపోలో ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే యువతి మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించినట్లు తెలుస్తోంది. ఆసుపత్రి సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు.
ఈ క్రమంలో రవితేజ ఆసుపత్రి నుంచి ఎవరికీ కనిపించకుండా వెళ్లిపోయినట్లు సమాచారం. మరోవైపు యువతి మృతదేహాన్ని పరిశీలించిన పోలీసులు ముఖంపై గాయాలు, వాతలు ఉన్నట్లు గుర్తించినట్లు తెలుస్తోంది. హోటల్ గదిలో రక్తపు మరకలు కూడా కనిపించడంతో ఘటనపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ప్రస్తుతం పోలీసులు హోటల్ సీసీటీవీ దృశ్యాలను పరిశీలిస్తూ, పరారీలో ఉన్న రవితేజ కోసం గాలిస్తున్నారు. యువతి మృతికి అసలు కారణం ఏంటి? హోటల్ గదిలో ఏం జరిగిందనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది.