DESHA TIMES
Newspaper Banner
Date of Publish : 17 September 2026, 3:34 pm Posted by : DESHA TIME

మిషన్ భగీరథ పైప్‌లైన్ లీకేజీకి సర్పంచ్ స్వయంగా మరమ్మతులు*

*మిషన్ భగీరథ పైప్‌లైన్ లీకేజీకి సర్పంచ్ స్వయంగా మరమ్మతులు*

*వర్కర్ కోసం వేచి చూడకుండా సమస్య పరిష్కారానికి ముందుకొచ్చిన సర్పంచ్ నాగార్జున*

 

దేశ టైమ్స్

మహబూబాబాద్

సెప్టెంబర్ 17

 

మహబూబాబాద్ జిల్లా కురవి మండలం లోని కందికొండ

గ్రామంలో మిషన్ భగీరథ ద్వారా వాటర్ ట్యాంక్‌కు నీరు సరఫరా చేసే ప్రధాన పైప్‌లైన్‌లో గత కొద్ది రోజులుగా లీకేజీ ఏర్పడడంతో నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడే పరిస్థితి నెలకొంది. సమస్యను గుర్తించిన కందికొండ గ్రామ సర్పంచ్ నాగార్జున మిషన్ భగీరథ సిబ్బంది కోసం వేచి చూడకుండా స్వయంగా మరమ్మతు పనుల్లో నిమగ్నమై పైప్‌లైన్ లీకేజీని సరిచేశారు.

పైప్‌లైన్ లీకేజీ కారణంగా నీరు వృథాగా పోవడంతో పాటు వాటర్ ట్యాంక్‌కు సరైన స్థాయిలో నీరు చేరకపోవడంతో గ్రామస్తులకు ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితి ఏర్పడింది. విషయం తెలుసుకున్న సర్పంచ్ వెంటనే స్పందించి సంబంధిత ప్రాంతానికి చేరుకున్నారు. మిషన్ భగీరథ వర్కర్ వచ్చే వరకు వేచి ఉండకుండా అవసరమైన పనులను స్వయంగా చేపట్టి పైప్‌లైన్ లీకేజీని గుర్తించి మరమ్మతులు చేశారు.

ప్రజలకు తాగునీటి సమస్య తలెత్తకుండా ముందస్తుగా చర్యలు తీసుకోవాలనే ఉద్దేశంతో సర్పంచ్ స్వయంగా రంగంలోకి దిగడంపై గ్రామస్తులు అభినందించారు. ప్రజా సమస్యల పరిష్కారంలో అధికారులు, సిబ్బందిపై మాత్రమే ఆధారపడకుండా తక్షణమే స్పందించి సమస్యను పరిష్కరించడం అభినందనీయమని గ్రామస్తులు పేర్కొన్నారు.

మిషన్ భగీరథ ద్వారా గ్రామాలకు అందుతున్న తాగునీటి సరఫరాలో ఎలాంటి అంతరాయం కలగకుండా పైప్‌లైన్‌లను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ, లీకేజీలు ఏర్పడిన వెంటనే మరమ్మతులు చేపట్టాల్సిన అవసరం ఉందని గ్రామస్తులు కోరుతున్నారు.