ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు
వలిగొండ, సెప్టెంబర్ 03 (దేశ టైమ్స్): మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో కృష్ణాష్టమి వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు అలకుంట్ల శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని సందడి చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు శ్రీకృష్ణుడు, గోపికల వేషధారణలో ముస్తాబై ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. చిన్నారులు సంప్రదాయ దుస్తులు ధరించి ఆటపాటలు, నృత్యాలు, వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. శ్రీకృష్ణుడి బాల్య లీలలను ప్రతిబింబించేలా విద్యార్థులు చేసిన ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి. చిన్నారుల ముద్దుముద్దు వేషధారణలు, ఆటపాటలు, సాంస్కృతిక ప్రదర్శనలతో పాఠశాల ప్రాంగణం సందడిగా మారింది. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు అలకుంట్ల శ్రీనివాస్ మాట్లాడుతూ పండుగల ద్వారా విద్యార్థులకు మన సంస్కృతి, సంప్రదాయాలు, ఆధ్యాత్మిక విలువలపై అవగాహన కల్పించవచ్చన్నారు. శ్రీకృష్ణుడి జీవితంలోని సత్యం, ధర్మం, మంచితనం వంటి విలువలను విద్యార్థులు అలవర్చుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయురాలు వరమ్మ, కవిత, మణిమాల, ఉషారాణి, ప్రశాంతి, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.