*కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన మాజీ ఎమ్మెల్యే రెడ్యానాయక్
దేశ టైమ్స్
మహబూబాబాద్ మరిపెడ, సెప్టెంబర్ 17:
గిరిజనులకు రిజర్వేషన్లను 6 శాతం నుంచి 10 శాతానికి పెంచిన నిర్ణయాన్ని గుర్తుచేసుకుంటూ మరిపెడ మున్సిపాలిటీ పరిధిలోని 5వ వార్డులో బీఆర్ఎస్ నాయకుల ఆధ్వర్యంలో గురువారం వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు చిత్రపటానికి డోర్నకల్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే డీఎస్ రెడ్యానాయక్, మహబూబాబాద్ జిల్లా మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ గుడిపూడి నవీన్‌రావు పాలాభిషేకం చేశారు. అనంతరం పార్టీ నాయకులు, కార్యకర్తలు నినాదాలు చేస్తూ తమ సంఘీభావాన్ని తెలిపారు.
ఈ సందర్భంగా మాజీ మంత్రి డి ఎస్ రెడ్యా నాయక్ మాట్లాడుతూ.. గిరిజనుల హక్కుల కోసం కేసీఆర్ ప్రభుత్వం తీసుకున్న రిజర్వేషన్ల పెంపు నిర్ణయం కీలకమైనదని పేర్కొన్నారు. గిరిజనులకు సామాజిక, విద్యా, ఉద్యోగ రంగాల్లో అవకాశాలు పెంచేందుకు అప్పటి ప్రభుత్వం పలు చర్యలు చేపట్టిందని తెలిపారు. కేసీఆర్ హయాంలో పోడు భూములకు పట్టాలు, గిరిజన గురుకులాలు, ఆశ్రమ పాఠశాలల అభివృద్ధి తదితర కార్యక్రమాలు చేపట్టినట్లు గుర్తుచేశారు.
*గిరిజన సంక్షేమంపై దృష్టి సారించాలి*
అనంతరం కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ నాయకులు విమర్శలు చేశారు. గిరిజనులకు రిజర్వేషన్లను పెంచినప్పటికీ వాటి ప్రయోజనాలు పూర్తిస్థాయిలో అందడం లేదని ఆరోపించారు. గిరిజన యువతకు ఉద్యోగ నియామకాల్లో న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరారు. గత ప్రభుత్వం ప్రారంభించిన గిరిజన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను కొనసాగిస్తూ మరింత విస్తరించాలని డిమాండ్ చేశారు.
గిరిజనుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇవ్వాలని, విద్య, ఉపాధి, భూమి, మౌలిక వసతుల విషయంలో ప్రత్యేక దృష్టి సారించాలని నాయకులు కోరారు. రిజర్వేషన్ల పెంపు నిర్ణయాన్ని గుర్తుచేసుకుంటూ మరిపెడ పట్టణంతో పాటు డోర్నకల్ నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల్లో జెండా ఆవిష్కరణలు, పాలాభిషేకాలు నిర్వహించినట్లు తెలిపారు.
ఈకార్యక్రమంలో 5వ వార్డు కౌన్సిలర్ బోడ భాస్కర్, బీఆర్ఎస్ నాయకులు గంట్ల మహిపాల్‌రెడ్డి, వస్రాం, బోడరెడ్డి, బోడ చరణ్ తదితరులతో పాటు యువకులు, గిరిజన మహిళలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.