DESHA TIMES
Newspaper Banner
Date of Publish : 20 September 2026, 4:59 pm Posted by : DESHA TIME

వినాయక నిమజ్జనాల్లో డీజే మోతలకు గుండెలు అదురుతున్నాయి. కేవలం రెండు రోజుల్లోనే తెలుగు రాష్ట్రాల్లో ఐదుగురు గుండెపోటుతో మరణించడం ఆందోళన కలిగిస్తోంది..

*వినాయక నిమజ్జనాల్లో డీజే మోతలకు గుండెలు అదురుతున్నాయి. కేవలం రెండు రోజుల్లోనే తెలుగు రాష్ట్రాల్లో ఐదుగురు గుండెపోటుతో మరణించడం ఆందోళన కలిగిస్తోంది.

 

నల్గొండ జిల్లా తిరుమలగిరి మండలంలో గణేష్ శోభాయత్ర జరిగింది. శోభాయాత్రలో డ్యాన్స్ చేస్తూ రాము (34) అనే వ్యక్తి మరణించాడు. ఊరేగింపులో డ్యాన్స్ చేసి రాము గణేష్ విగ్రమం తమ ఇంటిముందుకు రాగానే మెట్లపై కూర్చున్నాడు. కాసేపటికి గుండెపోటు రావడంతో ఒక్కసారిగా కుప్పకూలి పడిపోయాడు. హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా అప్పటికే మరణించినట్టు వైద్యులు తెలిపారు. మరోవైపు శనివారం ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో వినాయక నిమజ్జనంలో డ్యాన్స్ చేస్తూ కాకర్లమూడు ఈసు అనే వ్యక్తి కుప్పకూలాడు. వినాయకుడి ఊరేగింపులు ఈసు మరికొందరు కలిసి డ్యాన్స్ చేస్తుండగా ఒక్కసారిగా అతడు కిందపడిపోయాడు.

వెంటనే అతడిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే అతడు మరణించినట్టు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఈసు వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. శుక్రవారం కర్నూలు రూరల్ మండలం ఇ. తాండ్రపాడు గ్రామంలో వినాయకనిమజ్జనం వేడుకలో డీజే శబ్ధంగా కారణంగా శివమ్మ (36) అస్వస్థతకు గురయ్యారు. కాసేపటికే ఆమె గుండెపోటుతో మరణించారు. ఈ ఘటన జరిగినరోజే శుక్రవారం నంద్యాల జిల్లా డోన్‌ పట్టణంలో మరో విషాదం చోటుచేసుకుంది. ఇందిరానగర్‌కు చెందిన గణేశ్‌గౌడ్‌(23) అనే యవకుడు వినాయక నిమజ్జనం వేడుకలో పాల్గొని ఇంటికి వెళ్లిన తరవాత గుండెపోటుతో మరణించాడు.ఇక గురువారం ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఊరేగింపులో డ్యాన్స్ చేస్తూ ఇద్దరు మరణించారు. శ్రీసత్యసాయి జిల్లా సోమందేపల్లిలో శ్రీకాంత్‌(35) అనే యువకుడు స్నేహితులతో ర్యాలీగా వెళుతుండగా కప్పుకూలిపోయాడు. ఆస్పత్రికి తరలించగా అప్పటికే మరణించినట్టు తెలిపారు. అదేరోజు అనంతపురం జిల్లా గుత్తి స్టేట్‌ బ్యాంకు కాలనీలో వినాయక మండపం వద్ద బుధవారం రాత్రి మైక్‌లో పాటలకు డ్యాన్స్‌ చేస్తూ అశోక్‌ కుమార్‌(28) అనే యువకుడు కుప్పకూలిపోయాడు. స్థానిక ఆస్పత్రికి తరలించి అప్పటికే మరణించినట్టు వైద్యులు తెలిపారు.

 

*వైద్యులు ఏం చెబుతున్నారు..?*

భారీ శబ్దాలు కూడా గుండెపోటుకు కారణం కావచ్చని వైద్యులు చెబుతున్నారు. సాధారణంగా మానవుడి గుండె 60-80 డెసిబుల్స్ శబ్దాన్ని తట్టుకోగలదు. కానీ వినాయక నిమజ్జన వేడుకల్లో వాడే డీజేలు 100 నుండి 120 డెసిబుల్స్ కంటే ఎక్కువ శబ్దాన్ని ఉత్పత్తి చేస్తాయి. ఈ శబ్దానికి వచ్చే ప్రకంపనలకు గుండె లయ అస్తవ్యస్తం అవుతుంది. దానికి తోడు నిద్రలేమి, ఆయసం, శారీకశ్రమ అధికంగా ఉండటం కార్డియాక్ అరెస్ట్‌కు దారి తీస్తుందని హెచ్చరిస్తున్నారు.

 

*వైద్యులు హెచ్చరిస్తున్నా మారని తీరు*

అధిక శబ్దాల వల్ల మరణాలు సంభవించే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నా, డీజేలపై నిషేదం విధించినా మండపాల నిర్వహాకుల తీరు మారడంలేదు. ఒకరికంటే మరొకరు పోటీగా డీజేలను తీసుకువస్తున్నారు. కొంతమంది అయితే ఏకంగా ఇతర రాష్ట్రాల నుండి సైతం బ్యాండ్, డీజేలను తీసుకువస్తూ వినాయక నిమజ్జనాన్ని నిర్వహిస్తున్నారు.