బండ్లగూడలో దారుణం.. వైన్స్‌లో వ్యక్తిని కత్తులతో నరికి చంపిన దుండగుల
హైదరాబాద్: వినాయక చవితి వేళ నగరంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. నాగోల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బండ్లగూడలో ఓ వ్యక్తిని గుర్తుతెలియని దుండగులు కత్తులతో నరికి హత్య చేశారు.
దుండగులు వెంటాడటంతో ప్రాణభయంతో పరుగులు తీసిన బాధితుడు బండ్లగూడలోని సుప్రీమ్ వైన్స్‌లోకి వెళ్లాడు. అయితే దుండగులు అక్కడికి కూడా చేరుకుని వేటకొడవళ్లు, కత్తులతో దాడి చేసి హత్య చేశారు. అనంతరం కారులో అక్కడి నుంచి పరారయ్యారు.
సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకున్నారు. తీవ్రంగా గాయపడిన వ్యక్తిని ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వైన్స్‌లోని సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించగా, దుండగులు కారులో వచ్చినట్లు గుర్తించారు. మృతుడి వివరాలు, హత్యకు గల కారణాలు, నిందితుల ఆచూకీ తెలియాల్సి ఉంది.
సినిమా తరహాలో జరిగిన ఈ హత్యతో బండ్లగూడలో తీవ్ర కలకలం రేగింది.