గులాబీమయమైన బోనకల్.. హోరెత్తిన భారీ బైక్ ర్యాలీ
బోనకల్, సెప్టెంబర్ 21 (దేశ టైమ్స్):
బోనకల్‌లో బీఆర్ఎస్ నూతన మండల పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం సందర్భంగా పట్టణం గులాబీమయమైంది. బీఆర్ఎస్ మధిర నియోజకవర్గ ఇన్‌చార్జ్, మాజీ జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు ముఖ్య అతిథిగా హాజరై సోమవారం పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా రావినూతల నుంచి బోనకల్ వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. గులాబీ జెండాలతో సాగిన ర్యాలీతో పట్టణ ప్రధాన వీధులు పార్టీ నినాదాలతో మార్మోగాయి.
అనంతరం నిర్వహించిన సభలో లింగాల కమల్ రాజు మాట్లాడుతూ, బోనకల్‌లో ప్రారంభించిన బీఆర్ఎస్ కార్యాలయం కేవలం పార్టీ కార్యకలాపాలకే పరిమితం కాదని, ప్రజల కోసం పనిచేసే “జనతా గ్యారేజ్”, ప్రజా సమస్యలపై పోరాడే కేంద్రంగా ఉంటుందని అన్నారు. ప్రజలు తమ సమస్యలను కార్యాలయానికి తీసుకురావచ్చని, వాటిని అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం కోసం పార్టీ నాయకులు కృషి చేస్తారని తెలిపారు.
గ్రామస్థాయి నుంచి మండలస్థాయి వరకు ప్రజల సమస్యలను తెలుసుకుని, అవసరమైన పోరాటాలు నిర్వహించేందుకు ఈ కార్యాలయం కేంద్రంగా నిలుస్తుందని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వంపై కమల్ రాజు విమర్శలు చేశారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రజలకు ఇచ్చిన హామీల అమలుపై స్పష్టమైన సమాధానం ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నారని ఆరోపించారు. రైతులు, యువత, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి, ప్రజా సమస్యలపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు.
“రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమే. తెలంగాణ ప్రజలు కేసీఆర్ నాయకత్వాన్ని తిరిగి కోరుకుంటున్నారు. కేసీఆర్‌ను మళ్లీ అధికారంలోకి తీసుకురావడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు” అని కమల్ రాజు అన్నారు. కేసీఆర్ పాలనలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలు గుర్తు చేసుకుంటున్నారని పేర్కొన్నారు.
బీఆర్ఎస్ కార్యకర్తలు ప్రజల్లోకి వెళ్లి వారి సమస్యలను తెలుసుకోవాలని, ప్రతి గ్రామంలో పార్టీని మరింత బలోపేతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. బోనకల్ నూతన పార్టీ కార్యాలయం ద్వారా మండలంలోని ప్రతి గ్రామంతో పార్టీకి మరింత బలమైన అనుసంధానం ఏర్పడుతుందని అన్నారు.
“ప్రజల సమస్యలపై ప్రశ్నించే గొంతుకగా ఉంటాం.. ప్రజలకు అండగా నిలుస్తాం.. అవసరమైతే ప్రజల కోసం రోడ్డెక్కి పోరాటం చేస్తాం” అని కమల్ రాజు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మండల పార్టీ సీనియర్ నాయకులు, మాజీ జడ్పీటీసీ బానోత్ కొండ, గ్రామ సర్పంచ్ బానోతు జ్యోతి, మండల నాయకులు పార ప్రసాద్, వేమూరి ప్రసాద్, జంగా రవి, మోదుగుల నాగేశ్వరరావు, బంధం నాగేశ్వరరావు, కాకాని శ్రీనివాసరావు, గద్దల వెంకటేశ్వర్లు, ఇటికాల శ్రీనివాసరావు, చొప్పకట్లపాలెం హుస్సేన్ భాయ్, ఆలపాడు సర్పంచ్ నాగేశ్వరరావు, లక్ష్మీపురం సర్పంచ్, బోనకల్ సర్పంచ్ తన్నీరు పుల్లారావు, తదితర నాయకులు, గ్రామ శాఖ సభ్యులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.