Date of Publish : 14 August 2026, 8:48 amPosted by : DESHA TIME
🚨 పాఠశాలలో విషాదం.. చెట్టు కొమ్మలు విరిగిపడి విద్యార్థిని మృతి
స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల ఆటల పోటీల్లో విషాదం చోటు చేసుకుంది. పాఠశాల ఆవరణలో ఆడుకుంటున్న విద్యార్థులపై చెట్ల కొమ్మలు విరిగిపడిన ఘటనలో మూడో తరగతి విద్యార్థి ప్రాణాలు కోల్పోయింది. యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక బాగాయత్ పాఠశాలలో గురువారం ఈ ప్రమాదం జరిగింది. ఉపాధ్యాయులు పిల్లలకు ఆటల పోటీలు నిర్వహిస్తున్న సమయంలో ఓ చెట్టు కొమ్మ విరిగి పక్కనే ఉన్న మరో చెట్టుపై పడింది. ఆ బరువుకు రెండు చెట్ల కొమ్మలు ఒక్కసారిగా కింద ఆడుకుంటున్న విద్యార్థులపై కూలాయి. ఈ ప్రమాదంలో చిన్నారి ఎండీ హలీమా (8) తీవ్రంగా గాయపడింది. చికిత్స కోసం బీబీనగర్ ఎయిమ్స్‌కు తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ద్ధారించారు. ప్రణీత్ అనే మరో విద్యార్థికి కాలు విరగగా, ఎనిమిది మంది విద్యార్థులకు గాయాలయ్యాయి. కాగా, పాఠశాల ఆవరణలోని 60 ఏళ్ల నాటి భారీ వేప చెట్టు మొదట్లో ఈ నెల 4న ఆకతాయిలు నిప్పు పెట్టడమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. ఈ క్రమంలో చెట్టు బలహీనపడటంతో..గాలి, వాన లేకపోయినా కాలిన కొమ్మ విరిగి పక్క చెట్టుపై పడటంతో దారుణం జరిగిందని స్థానికులు భావిస్తున్నారు. ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య, మాజీ ఎంపీ డా. బూర నర్సయ్య గౌడ్ ఎయిమ్స్‌కు చేరుకుని బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. బాధిత విద్యార్థులందరికీ న్యాయం చేస్తామని ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి హామీ ఇచ్చారు.