DESHA TIMES
Newspaper Banner
Date of Publish : 22 August 2026, 6:02 pm Posted by : DESHA TIME

షైన్ హైస్కూల్‌పై వచ్చిన ఆరోపణలు అవాస్తవం

షైన్ హైస్కూల్‌పై వచ్చిన ఆరోపణలు అవాస్తవం

 

మాజీ సిబ్బంది స్పష్టీకరణ.. అపార్థంతోనే ఆరోపణలు వచ్చాయని వెల్లడి

 

ఖమ్మం ప్రతినిధి, ఆగస్టు 22 (దేశ టైమ్స్):

మండల పరిధిలోని రావినూతల గ్రామంలోని షైన్ హైస్కూల్, కరస్పాండెంట్‌పై గతంలో వచ్చిన ఆరోపణల్లో వాస్తవం లేదని, పాఠశాలలో గతంలో పనిచేసి వెళ్లిన ఉపాధ్యాయులు పుచ్చకాయల నాగమల్లేశ్వరి, పుచ్చకాయల తిరుపతమ్మ స్పష్టం చేశారు. శనివారం పాఠశాల ప్రిన్సిపల్ ఐటిపాముల శ్వేతను కలిసి తమ వివరణను లిఖితపూర్వకంగా అందించారు.

 

కరస్పాండెంట్ మహిళల పట్ల దురుసుగా ప్రవర్తించారన్న వార్తల్లో వాస్తవం లేదని వారు తెలిపారు. అలాగే తమ మొబైల్ ఫోన్లను అనుమతి లేకుండా తనిఖీ చేశారన్న ఆరోపణలు కూడా నిజం కాదన్నారు. పాఠశాల యాజమాన్యం తమను మానసికంగా వేధించిందన్న ఆరోపణల్లోనూ ఎలాంటి వాస్తవం లేదని స్పష్టం చేశారు.

 

తాము పాఠశాలను వీడటానికి ప్రధాన కారణం యాజమాన్యంతో ఏర్పడిన కొద్దిపాటి మనస్పర్థలేనని, తమకు ఇబ్బందికరమైన ఇతర కారణాలేమీ లేవని పేర్కొన్నారు. తమకు రావాల్సిన జీతాల చెల్లింపుల విషయంలో మాత్రమే అప్పట్లో మండల విద్యాశాఖ అధికారికి వినతిపత్రం సమర్పించామని తెలిపారు.

 

అయితే, ఆ వినతిపత్రాన్ని ఆసరాగా చేసుకుని పూర్వ యాజమాన్యానికి చెందిన యరమల సంజీవరెడ్డి పాఠశాలపై, ప్రస్తుత కరస్పాండెంట్‌పై పలు ఆరోపణలు చేస్తూ వార్తలు ప్రచారం చేయించారని వారు పేర్కొన్నారు. అక్కడ పనిచేస్తున్న తమను ప్రభావితం చేసి, విషయాలను తప్పుగా అర్థం చేసుకునేలా చేసి, తమను పావులుగా ఉపయోగించుకున్నారని ఆరోపించారు.

 

గతంలో జరిగిన పరిణామాలపై పూర్తి వాస్తవాలను తెలుసుకోకుండా పాఠశాల యాజమాన్యంపై ఆరోపణలు చేయడం సరికాదని వారు పేర్కొన్నారు. తమ వల్ల పాఠశాల యాజమాన్యానికి, కరస్పాండెంట్‌కు కలిగిన ఇబ్బందులకు విచారం వ్యక్తం చేశారు.

 

ఇకపై పాఠశాల యాజమాన్యంపై ఎలాంటి ఆరోపణలు వచ్చినా వాటి నిజానిజాలను పూర్తిగా విచారించిన తర్వాతే స్పందించాలని, అపోహలకు, అవాస్తవాలకు తావివ్వకుండా విద్యార్థుల ఉన్నత భవిష్యత్తుకు అందరూ సహకరించాలని వారు కోరారు.