బోనకల్ మండల కేంద్రంలో పోలీసుల స్పెషల్ డ్రైవ్
ఖమ్మం ప్రతినిధి ఆగష్టు 08(దేశ టైమ్స్ )
మండల కేంద్రంలో పోలీసుల ఆధ్వర్యంలో విస్తృతంగా స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ప్రధాన రహదారిపై వాహనాలను తనిఖీ చేస్తూ, ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తున్న వాహనదారులను గుర్తించారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని, వాహనాలకు సంబంధించిన ధ్రువపత్రాలను వెంట ఉంచుకోవాలని పోలీసులు సూచించారు.
ఈ కార్యక్రమంలో వైరా ఏసీపీ సారంగపాణి, సర్కిల్ ఇన్‌స్పెక్టర్ కొంగర మధు, బోనకల్ సబ్ ఇన్‌స్పెక్టర్ మాచినేని రవి, పలువురు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. మండల కేంద్రంలోని ప్రధాన రహదారులు, కూడళ్ల వద్ద వాహనాలను ఆపి తనిఖీలు చేపట్టారు.
ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ.. రోడ్డు ప్రమాదాల నివారణ, ట్రాఫిక్ నిబంధనల అమలు, వాహనదారుల్లో రహదారి భద్రతపై అవగాహన కల్పించడమే స్పెషల్ డ్రైవ్ ముఖ్య ఉద్దేశ్యమని తెలిపారు. వాహనదారులు నిబంధనలు పాటిస్తూ పోలీసులకు సహకరించాలని కోరారు.
ముఖ్యంగా హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనాలు నడపడం, డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడపడం, వాహనాలకు సరైన పత్రాలు లేకపోవడం వంటి నిబంధనల ఉల్లంఘనలపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.
బోనకల్ మండల కేంద్రంలో పోలీసులు పెద్ద ఎత్తున తనిఖీలు నిర్వహించడంతో వాహనదారులు అప్రమత్తమయ్యారు. ప్రజల భద్రతే ప్రధాన లక్ష్యంగా ఇకపై కూడా ఇలాంటి తనిఖీలు కొనసాగిస్తామని పోలీసు అధికారులు తెలిపారు.