DESHA TIMES
Newspaper Banner
Date of Publish : 21 August 2026, 5:10 pm Posted by : DESHA TIME

ఇంట్లోనే రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డ కరప్షన్ కింగ్ ( SI)

కేసులో సాయం చేస్తా రూ.30,000 ఇవ్వు.. గలీజ్ దందాకు తెరలేపిన రాజంపేట ఎస్ఐ

 

ఇంట్లోనే రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డ కరప్షన్ కింగ్

 

చట్టాన్ని రక్షించాల్సిన ఓ ఖాకీ లంచం బారినపడి ఏసీబీ వలకు చిక్కాడు. కేసులో సాయం చేసేందుకు బాధితుడి నుంచి రూ.30,000 నగదు లంచం తీసుకుంటూ కామారెడ్డి జిల్లా రాజంపేట పోలీస్ స్టేషన్ సబ్ ఇన్‌స్పెక్టర్ (ఎస్ఐ) దువ్వల ఆంజనేయులు అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు.

 

రాజంపేట పీఎస్ పరిధిలో నమోదైన ఓ కేసులో ఫిర్యాదుదారుని కుమారుడికి స్టేషన్ బెయిల్ మంజూరు చేసేందుకు, అలాగే తదుపరి చార్జ్‌షీట్ దాఖలు చేసే సమయంలో అనుకూలంగా ఉండేందుకు ఎస్ఐ దువ్వల ఆంజనేయులు భారీగా లంచం డిమాండ్ చేశారు. బాధితుడు ఎంత వేడుకున్నా ఆయన కనికరించలేదు. విసిగిపోయిన బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించి తన గోడును వెళ్లబోసుకున్నారు.

 

ఏసీబీ అధికారుల పక్కా ప్రణాళిక ప్రకారనం… గురువారం ఎస్ఐ ఆంజనేయులు తన నివాసంలో బాధితుడి నుంచి రూ.30,000 లంచం తీసుకుంటుండగా అధికారులు దాడులు చేశారు. ఈ దాడిలో ఎస్ఐ రంగు చేతులతో పట్టుబడ్డారు. ఆయన్నుంచి లంచం సొమ్మును స్వాధీనం చేసుకున్నారు. భద్రతా కారణాల దృష్ట్యా ఫిర్యాదుదారు వివరాలను గోప్యంగా ఉంచినట్లు అధికారులు తెలిపారు.

అనంతరం నిందితుడైన ఎస్ఐ ఆంజనేయులును అరెస్టు చేసి, హైదరాబాద్ నాంపల్లిలోని ఎస్‌పీఈ & ఏసీబీ కేసుల ప్రత్యేక న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచినట్లు ఏసీబీ వర్గాలు వెల్లడించాయి.

 

ప్రభుత్వ శాఖల్లో ఎవరైనా అధికారులు లంచం డిమాండ్ చేస్తే ప్రజలు భయపడకుండా ముందుకు రావాలని ఏసీబీ అధికారులు సూచించారు. ఏసీబీ టోల్ ఫ్రీ నంబర్ 1064 లేదా వాట్సాప్ నంబర్ 9440446106 ద్వారా నేరుగా ఫిర్యాదు చేయాలని కోరారు.